టెస్టుల్లో మహిళల రికార్డు

Dec 15,2023 10:14 #records, #tests, #Women
  • తొలిరోజే 400కు పైగా పరుగులు
  • టెస్ట్‌ చరిత్రలో రెండోసారి
  • శుభా, రోడ్రిగ్స్‌, యస్టిక, దీప్తి అర్ధసెంచరీలు
  • భారత్‌ 410/7
  • ఇంగ్లండ్‌ మహిళలతో ఏకైక టెస్ట్‌

ముంబయి : ఇంగ్లండ్‌ మహిళలతో జరుగు తున్న ఏకైక టెస్ట్‌లో భారత మహిళలు బ్యాటింగ్‌లో కదం తొక్కారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారతజట్టు 94ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 410పరుగులు చేసింది. మహిళల టెస్ట్‌ క్రికెట్‌లో ఓ జట్టు 400కు పైగా పరుగులు చేయడం ఇది రెండోసారి మాత్రమే. టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్స్‌ శోభ సతీశ్‌(69), జెమిమా రోడ్రిగ్స్‌(68), యస్టికా భాటియా(66), దీప్తి శర్మ(60నాటౌట్‌) తొలిరోజు అర్ధసెంచరీలతో రాణించగా.. టీమిండి యా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(49) చిన్న తప్పిదంతో అర్ధసెంచరీని తృటిలో చేజార్చుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు స్మృతి మంధాన(17), షెఫాలీ వర్మ(19) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. ఆ తర్వాత శుభా సతీశ్‌(69), జెమీమా రోడ్రిగ్స్‌(68) ఆదుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి 3వ వికెట్‌కు రికార్డు స్థాయిలో 115 పరుగులు జోడించారు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(49) హాఫ్‌ సెంచరీ చేజార్చుకోగా.. యస్టికా భాటియా, దీప్తి శర్మ(60నాటౌట్‌) ధనాధన్‌ ఆటతో ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. దాంతో, టీమిండియా తొలిరోజే 7వికెట్ల నష్టానికి 410పరుగులు చేసింది. సతీశ్‌ శుభా, జెమీమా రోడ్రిగ్స్‌, పేసర్‌ రేణుకా సింగ్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. లారెన్‌ బెల్‌కు రెండు, క్రాస్‌, బ్రంట్‌, డీన్‌, ఎక్లేస్టోన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.

హర్మన్‌ మరోసారి సిల్లీగా..

టీమిండియా మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మరోసారి సిల్లీగా ఔటయ్యింది. హర్మన్‌ ఇలా ఔటవ్వడం ఇది రెండోసారి. వన్డేల్లో ఓసారి ఆస్ట్రేలియాపై ఇదే తరహాలో వెనుదిరిగిన హర్మన్‌.. ఈసారి 49 పరుగుల వద్ద వ్యక్తిగత స్కోర్‌వద్ద సింగిల్‌ తీయాలనుకుంది. కానీ, బంతిని గమనించిన నాన్‌స్ట్రయికర్‌ యస్టికా భాటియా పరుగుకు నిరాకరించి వెనక్కి పంపింది. దాంతో రనౌట్‌ తప్పించుకునేందుకు ఆమె క్రీజువైపు పరుగెత్తింది. గీతపై బ్యాటు కూడా పెట్టింది. అయితే.. ఊహించని విధంగా బ్యాటు క్రీజులో ఇరుక్కుపోయింది. అప్పటికే డానియెల్లే వ్యాట్‌ విసిరిన బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. దాంతో, థర్డ్‌ అంపైర్‌ రిప్లే అనంతరం హర్మన్‌ప్రీత్‌ను ఔట్‌గా ప్రకటించారు. దాంతో, ఆమె నిరాశగా పెవిలియన్‌ బాట పట్టింది.

స్కోర్‌బోర్డు..

భారత మహిళల తొలిఇన్నింగ్స్‌: స్మృతి మంధాన (బి)లారెన్‌ బెల్‌ 17, షెఫాలీ వర్మ (బి)క్రాస్‌ 19, శుభా సతీశ్‌ (సి)స్కీవర్‌ బ్రంట్‌ (బి)ఎక్లేస్టోన్‌ 69, రోడ్రిగ్స్‌ (బి)లారెన్‌ బెల్‌ 68, హర్మన్‌ప్రీత్‌ (రనౌట్‌) వాట్‌ 49, యస్టికా భాటియా (సి)లారెన్‌ బెల్‌ (బి)ఛార్లీ డీన్‌ 66, దీప్తి శర్మ (బ్యాటింగ్‌) 60, స్నేV్‌ా రాణా (బి)స్కీవర్‌ బ్రంట్‌ 30, పూజ వస్త్రాకర్‌ (బ్యాటింగ్‌) 4, అదనం 28, (94 ఓవర్లలో 410పరుగులు) వికెట్ల పతనం: 1/25, 2/47, 3/162, 4/190, 5/306, 6/313, 7/405 బౌలింగ్‌: క్రాస్‌ 14-0-64-1, లారెన్‌ బెల్‌ 15-1-64-2, స్కీవర్‌ బ్రంట్‌ 11-4-25-1, లారెన్‌ ఫిలెర్‌ 15-1-84-0, ఛార్లొట్‌ 17-1-62-1, ఎక్లేస్టోన్‌ 22-4-85-1.

➡️