గాజాపై ఆగని దాడులు- గత 24 గంటల్లో 76 మంది మృతి

Mar 27,2024 23:48 #Attacks, #Gaza

ఈ మానవ విపత్తును ఆపాలి: ఐరాస చీఫ్‌
గాజా: రంజాన్‌ సందర్భంగా గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఐరాస భద్రతా మండలి తీర్మానం చేసిన తరువాత కూడా ఇజ్రాయిల్‌ వైమానిక దాడులను కొనసాగిస్తోంది. గడచిన 24 గంటల్లో ఇజ్రాయిల్‌ దాడులు కారణంగా గాజాలో 76 మంది మరణించారు. బుధవారం జబాలియా శరణార్థి శిబిరంతో పాటు గాజాలోని వివిధ ప్రాంతాలపై వైమానిక దాడి జరిగింది. రఫా నగరంలోనూ దాడులు కొనసాగాయి. అక్టోబరు 7 నుండి ఇప్పటివరకు ఈ దాడుల కారణంగా 32,414 మంది పాలస్తీనియన్లు మరణించారు. దీనికి తోడు వ్యాధులు, ఆకలిబాధతో అనేక మంది చనిపోతున్నారు.ఈ మానవ విపత్తుకు ఇజ్రాయిలే పూర్తి బాధ్యత వహించాలని ఐరాస చీఫ్‌ ఆంటోనియా గుటెరస్‌ అన్నారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమలు చేయడంలో విఫలమైతే మానవాళి మనల్ని క్షమించదని ఆయన హెచ్చరించారు.
ఇజ్రాయిల్‌ జైల్లో పాలస్తీనియన్లపై చిత్రహింసలు
ఇజ్రాయిల్‌ జైల్లో బంధించబడి ఉన్న పాలస్తీనీయ్లు చిత్రహింసలకు గురవుతున్నారని పాలస్తీనా డిటైనీలు, మాజీ ఖైదీల వ్యవహారాల కమిషన్‌ బుధవారం విమర్శించింది. ఇజ్రాయిల్‌ ప్రిజన్‌ సర్వీస్‌ ఆడ, మగ తేడాకుండా హింసాకాండ కొనసాగిస్తోందని, వారి జీవితాలను ప్రత్యక్ష నరకంగా మార్చిందని కమిషన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఖైదీలను ఇజ్రాయిల్‌ సైనికులు కొడుతున్న శబ్ధాన్ని ఒక న్యాయవాది ప్రత్యక్షంగా విన్నారని తెలిపింది. బీర్షెబాకు సుమారు వంద కిలోమీటర్లు దూరంలో ఉన్న నప్హా జైలులో ఖైదీలకు కనీసం వంటిమీద బట్టలు కూడా లేవని కమిషన్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

➡️