గాజాలో కొనసాగుతున్న భీకర పోరు

Dec 12,2023 10:30 #israel hamas war
  • ఇప్పటివరకు 18వేల మందికి పైగా మృతి
  • మల్లాలో పాలస్తీనియన్ల ప్రదర్శన
  • యుద్ధం ముగింపు కనుచూపు మేరలో లేదన్న నెతన్యాహు
  • రఫా క్రాసింగ్‌ వద్దకు పలు దేశాల రాయబారుల బృందం

గాజా : గాజా సెంట్రల్‌, ఉత్తర ప్రాంతాల్లో ఇజ్రాయిల్‌ దారుణంగా వైమానిక దాడులు జరుపుతోంది. మరోవైపు దక్షిణ ప్రాంతంలో పదాతి దళాల పోరాటం భీకరంగా సాగుతోంది. ఇప్పటివరకు 18వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వేల సంఖ్యలోనే గాయపడ్డారు. శాంతి కోసం ఒక్క తాటిపైకి రావాలని కోరుతూ ఈజిప్ట్‌, మారిటానియాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో మంగళవారం ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇజ్రాయిల్‌, హిజ్బుల్లాలు వైమానిక దాడులను ముమ్మరం చేసి, డ్రోణ్‌ దాడులు జరుపుతున్నందున, ఈ ఘర్షణలు, యుద్ధం మరింత విస్తరించబడతాయని లెబనాన్‌లో ఐక్యరాజ్య సమితి బలగాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గాజాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని డాక్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ ఎమర్జన్సీ కోఆర్డినేటర్‌ మేరీ ఆర్‌ పియర్రట్‌ తెలిపారు. అల్‌ అక్సా ఆస్పత్రి లోపల నుండి ఆమె మీడియాతో మాట్లాడారు. గాజాలో తమ సంస్థ సేవలు చాలా పరిమితంగా అందుతున్నాయన్నారు. గాయపడి చికిత్స కోసం వచ్చే వారిని ఆదుకోవడం చాలా కష్టంగా మారిందని చెప్పారు. వైద్య సిబ్బందికి కూడా రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. అనేకమంది అసలు ఆస్పత్రులకు వచ్చే పరిస్థితి కూడా లేకపోయిందన్నారు. గాజాకు మద్దతుగా రమల్లా నగరంలో పాలస్తీనా అనుకూల ప్రదర్శన జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇందులో పాల్గొన్నారు. గాజాలో చనిపోయిన వారికి అంకితం చేస్తూ ఒక పోస్టర్‌ను వేలాడదీశారు. అన్ని వయసుల వారు ఇందులో పాల్గొన్నారు. పిల్లలు పాలస్తీనా పతాకాలు గీస్తూ తమ వంతుగా సంఘీభావం అందించారు. పాలస్తీనా జీవించేలా అవసరమైతే మేం మరణిస్తామంటూ వారు నినదించారు. తుపాకులతో కాల్పులు జరిపినా భయపడేది లేదని వారు పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించడం ఇంకా చాలా దూరంలో వుందని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. తామనుకున్న లక్ష్యాలు నెరవేరేవరకు ఈ పోరు ఆగదని ఆయన స్పష్టం చేశారు. సుదీర్ఘ మైన యుద్ధం కొనసాగించే శక్తి సామర్ధ్యాలు ఇజ్రాయిల్‌ మిలటరీకి వున్నాయన్నారు. యుద్ధానంతర గాజాపై చర్చించేందుకు రహస్య బృందాన్ని నెతన్యాహు ఏర్పాటు చేశారు. రక్షణ రంగానికి చెందిన వారితో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ భద్రతా సలహాదారు, వ్యూహాత్మక వ్యవహారాల మంత్రి నేతృత్వంలో ఈ బృందం ఇప్పటికి నాలుగుసార్లు సమావేశమైంది. ఈ వారంలో మరోసారి భేటీ కానుందని ఇజ్రాయిల్‌ చానల్‌ పేర్కొంది. ఈ బృందంలో ఆర్మీ, మొస్సాద్‌, షిన్‌బెట్‌ ప్రతినిధులు కూడా వున్నారు. గాజాలో సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో రఫా క్రాసింగ్‌ వద్ద పరిశీలించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దూతలు ఈజిప్ట్‌ చేరుకున్నారు. ఈజిప్ట్‌, యుఎఇలు ఈ పర్యటనను ఏర్పాటు చేశాయి. రష్యా, బ్రిటన్‌ దేశాలతో కలిపి మొత్తంగా 12మంది రాయబారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. పాలస్తీనియన్ల బాధ, కష్టాలను నిర్లక్ష్యం చేయడం ఎంత మాత్రమూ సమర్ధనీయం కాదని ఈజిప్ట్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. గాజా ప్రజల ఇబ్బందులను, అక్కడ జరిగిన వినాశనాన్ని చూడడమే కాకుండా వారి బలాన్ని, ఆశను కూడా అర్థం చేసుకోవడానికి ఈ పర్యటన ఉపకరిస్తుందని ఐక్యరాజ్య సమితిలో యుఎఇ రాయబారి వ్యాఖ్యానించారు.

➡️