మాస్కో చేరుకున్న ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ

Dec 8,2023 10:30 #Ibrahim Raisi, #Iran, #President

 

మాస్కో: ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర అంశాలపై చర్చించేందుకు ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆయన నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం మాస్కోకు చేరుకుంది. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితితో బాటు అనేక కీలక అంశాలపై రైసీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించనున్నారని రష్యన్‌ అధ్యక్ష భవనం (క్రెమ్లిన్‌) తెలిపింది. క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ మాట్లాడుతూ, చర్చలు ముగిసిన తర్వాత ఇద్దరు అధ్యక్షులు మీడియాకు ఎలాంటి ప్రకటన చేసే యోచనేదీ లేదని చెప్పారు. ఇరుపక్షాలు ద్వైపాక్షిక సహకారంతో పాటు రవాణా, ఇంధనం, రష్యా – ఇరాన్‌ మధ్య వాణిజ్య, ఆర్థిక రంగాలలో ఉమ్మడి ప్రాజెక్టులపై ఉభయులు చర్చిస్తారని పెస్కోవ్‌ తెలిపారు. పశ్చిమాసియాలో పరిస్థితి, ముఖ్యంగా ఇజ్రాయెల్‌- పాలస్తీనా మధ్య కొనసాగుతున్న వివాదం గాజాలో మానవ హక్కుల ఉల్లంఘన వంటి అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని ఇరాన్‌ వార్తా సంస్థ తస్నిమ్‌ పేర్కొంది పుతిన్‌ .సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నాయకులతో చర్చలు జరిపిన తర్వాత ఇప్పుడు రైసీతో సమావేశం అవుతున్నారు. పశ్చిమాసియాపై అమెరికన్‌ సామ్రాజ్యవాదం ఆధిపత్యాన్ని రష్యా, చైనా సవాల్‌ చేస్తున్న నేపథ్యంలో ఇరాన్‌ నేత మాస్కో పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

➡️