ఇజ్రాయిల్‌ దాడుల్లో 19మంది మృతి

Mar 11,2024 23:56 #israel hamas war, #issrel, #War
  •  పలు ఇళ్లు ధ్వంసం

గాజా : రంజాన్‌ మాసం ప్రారంభపు రోజున సైతం గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు ఆగలేదు. పలు నివాస ప్రాంతాలపై ఇజ్రాయిల్‌ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 19 మంది మరణించారు. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. గాజాలోఎటు చూస్తే అటు ఆకలి రక్కసి కోరలు చాస్తోంది. రంజాన్‌ సందర్భంగా ప్రార్థనలు చేసుకోవడానికి అల్‌ అక్సా మసీదులోకి వెళ్ళనీయకుండా వందలాదిమంది పాలస్తీనియన్లను సైన్యం అడ్డుకుంటోంది. రంజాన్‌కి ముందుగానే కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాన కారణం ఇజ్రాయిలే అని హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో అధినేత ఇస్మాయిల్‌ హనియె విమర్శించారు. గాజాలో యుద్ధానికి అంతం పలకని ఒప్పందం మాకు వద్దని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఈ యుద్ధంలో 31,045 మంది పాలస్తీనియన్లు మరణించగా, 72,654మంది గాయపడ్డారు. రఫా, గాజా నగరాల్లో నివాస ప్రాంతాలపై ఇజ్రాయిల్‌ జరిపిన తాజా బాంబు దాడుల్లో 19మంది మరణించారు.
పెద్దఎత్తున మానవతా సాయం వెంటనే అందించండి : ఐరాస
గాజాలో పెద్ద ఎత్తున మానవతా సాయం అందాలని, అది కూడా చాలా వేగంగా జరగాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ పిలుపునిచ్చారు. ఈ దిశగా వున్న అడ్డకుంలన్నింటినీ తొలగించాలన్నారు. హమాస్‌ తన చెరలో వున్న బందీలందరినీ తక్షణమే విడుదల చేయాలని కోరారు. గాజాలో నాలుగో వంతు జనాభా కరువు వాతన పడుతున్న నేపథ్యంలో ఈ సాయం అందడమే తక్షణ కర్తవ్యమన్నారు.

➡️