Gaza: ఒక్క రోజు గాజాలో 86మంది పాలస్తీనియన్లు మృతి

గాజా : గాజాలో గత ఐదు మాసాలుగా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణ హోమంలో మంగళ వారం ఒక్క రోజు వ్యవధిలో 86మంది పాలస్తీ నియన్లు మరణిం చారు. సెంట్రల్‌, దక్షిణ గాజాల్లో ఇజ్రాయిల్‌ బలగాలు బాంబులు, శతఘ్ని దాడులతో విరుచుకు పడ్డాయి. రఫా, ఖాన్‌ యూనిస్‌ నగరాల్లోని లక్ష్యాలపై కూడా సైన్యం దాడులకు పాల్పడింది. ఖాన్‌ యూనిస్‌లోని అల్‌ ఖరారా ప్రాంతంలో బాంబు దాడుల్లో ఇద్దరు మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు. ఉత్తర గాజాలో మొత్తంగా జనాలు లేకుండా నిర్వీర్యం చేయాలని ఇజ్రాయిల్‌ భావిస్తోందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దాడులను ఉధృతం చేయడం, కరువు కాటకాలు పెచ్చరిల్లేలా చేయడం వల్ల ఉత్తర గాజా నుండి ప్రజలు తరలివెళ్లిపోవాలని చూస్తున్నారని పాలస్తీనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇప్పటికి 152 రోజుల నుండి గాజాపై ఇజ్రాయిల్‌ ఊచకోతకు పాల్పడుతోందని తెలిపింది. ఉత్తర గాజాలో ఐదు లక్షలమందికి పైగా ప్రజలు అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారని పేర్కొంది. అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్న బాంబు దాడులు, ముంచుకొస్తున్న దుర్భిక్షంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. 2021లో 45మంది యూదు యాత్రికులు చనిపోవడానికి దారి తీసిన ఘటనకు ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు వ్యక్తిగత బాధ్యతను వహించాలని ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన కమిటీ తేల్చి చెప్పింది. దీంతో నెతన్యాహుపై ఒత్తిడి పెరుగుతోంది. యాత్రా స్థలంలో కల్లోల పరిస్థితులు నెలకొంటాయని నెతన్యాహు కార్యాలయాన్ని ముందుగానే హెచ్చరించారని, కానీ వాటిని పరిష్కరించడానికి సరైన చర్యలు తీసుకోలేదని దర్యాప్తు కమిటీ భావించింది. లెబనాన్‌ సరిహద్దుల్లో మౌంట్‌ మిరాన్‌ వద్ద రబ్బి సమాధికి 2021 ఏప్రిల్‌లో జరిగిన యాత్రా ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ యాత్రలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. ఇప్పటికే గాజాలో యుద్ధాన్ని ఆపాలంటూ పశ్చిమ మిత్ర దేశాల నుండి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న నెతన్యాహుకు ఇది మరో ఎదురు దెబ్బ.

 

➡️