గాజాలో కాల్పుల విరమణ పాటించాలి

Apr 11,2024 00:02 #Israel and Hamas, #issrel, #War
  •  800మందికి పైగా ఆరోగ్య నిపుణులు బహిరంగ లేఖ

గాజా : గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని కోరుతూ 800మందికి పైగా ప్రజారోగ్య రంగ నిపుణులు బుధవారం ఓ బహిరంగ లేఖ రాశారు. ఇజ్రాయిల్‌ నిరంతర దాడులతో గాజాలో నెలకొన్న ప్రజారోగ్య విపత్తు పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవమైన ఏప్రిల్‌ 7 నాటికి గాజాలో ఇజ్రాయిల్‌ నరహంతక దాడులకు ఆరు మాసాలు పూర్తయిన సందర్భంగా వారు ఈ లేఖ రాశారు. . పీపుల్స్‌ హెల్త్‌ మూవ్‌మెంట్‌ (పిహెచ్‌ఎం), గ్రాస్‌రూట్స్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ హెల్త్‌ వర్కర్స్‌, కార్యకర్తలు, సంస్థలు, అంతర్జాతీయ విద్యావేత్తలతో సహా పలు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఈ లేఖపై సంతకాలు చేశాయి.
గాజాలో మానవ కల్పిత క్షామం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని వారు తీవ్రంగా నిరసించారు. ఇజ్రాయిల్‌ బాంబు దాడుల్లో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా నాశనమైందన్నారు. దీనికి నెతన్యాహు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఇజ్రాయిల్‌ నిరంతర దాడుల నుండి బతికి బట్ట కట్టినవారు ప్రజారోగ్యానికి సంబంధించిన పెను విపత్తును ఎదుర్కొంటున్నారని ఆ లేఖలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో బేషరతుగా తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని, ఆరోగ్య కార్యకర్తలకు రక్షణ కల్పించాలని, పరిశుభ్రమైన తాగునీరును అందించాలని, పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరచాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా మానవతా సాయం అందేలా చూడాలని ఆ లేఖలో వారు అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు.

➡️