పాలస్తీనాకు సంఘీభావంగా బ్రిటన్‌లో ర్యాలీల హోరు

Nov 28,2023 09:46 #israel hamas war

 లండన్‌: గాజాలో శాశ్వత కాల్పుల విరమణ ప్రకటించాలంటూ బ్రిటన్‌ అంతటా వేలాది మంది వీధుల్లోకి వచ్చి నినదించారు. గత ఏడు వారాలుగా క్రమం తప్పకుండా వారాంతంలో రెండు రోజుల పాటు పాలస్తీనా సంఘీభావ ర్యాలీలతో బ్రిటన్‌ హోరెత్తుతోంది. శని, ఆదివారాల్లో లండన్‌, గ్లాస్గో, మాంచెస్టర్‌, లీడ్స్‌ ఎడిన్‌బర్గ్‌, ఇతర ముఖ్య పట్టణాల్లో వేలాది మందితో ర్యాలీలు జరిగాయి. అమెరికా, బ్రిటన్‌, ఇతర సామ్రాజ్యవాదుల పూర్తి మద్దతుతో నెతన్యాహు ప్రభుత్వం సాగిస్తున్న యుద్ధ నేరాలను ఖండిస్తూ ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శించారు. గాజాలో ఇజ్రాయిల్‌ నరమేధంపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం ఈ ర్యాలీల్లో ప్రతిబింబించింది. బ్యాంకులన్నీ మూతపడ్డాయి. పాలస్తీనాకు సంఘీభావంగా యూనివర్సిటీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఇందుకు అభినందించాల్సింది పోయి, యూనివర్సిటీల పాలకవర్గాలు అణచివేత చర్యలకు పాల్పడ్డాయి. సంఘీభావ ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థి గ్రూపులను సస్పెండ్‌ చేశాయి. పాలకవర్గాల చర్యను నిరసిస్తూ అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు క్యాంపస్‌లలో ఆందోళనకు దిగారు. వారు ఏం చేశారన్నదాంతో నిమిత్తం లేకుండా ఎవరినైనా అరెస్టు చేసే నిరంకుశ అధికారాన్ని ప్రభుత్వం పోలీసులకు ఇచ్చింది. దీంతో సెక్షన్‌12 కింద లండన్‌లో 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వం, ఇజ్రాయిల్‌ అనుకూలవాదులు నిరసనకారులపై జాతి విద్వేషకులన్న ముద్ర వేస్తున్నాయి. సిరియాలోని డమాస్కస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇజ్రాయిల్‌ దాడిని రష్యా ఖండించింది. ఇది రెచ్చగొట్టే చర్య అని రష్యన్‌ విదేశాంగ మంత్రి మేరియా జఖరొవ్‌ పేర్కొన్నారు. జర్నలిస్టులపై ఊచకోతను ఆపండిఅంతర్జాతీయ జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ డిమాండ్‌ పాలస్తీనా జర్నలిస్టులపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఊచకోతను వెంటనే ఆపాలని అంతర్జాతీయ జర్నలిస్టుల పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది. అక్టోబరు 7 నుంచి ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దాడుల్లో 63 మంది పాలస్తీనా జర్నలిస్టులు గాజా, వెస్ట్‌బ్యాంక్‌ల్లో చనిపోయారు. ఈ ఊచకోతలో అమెరికా పాత్ర కూడా ఉందని కమిటీ పేర్కొంది. జర్నలిస్టులపై నెతన్యాహు ప్రభుత్వం సాగిస్తున్న ఈ దాడులు పత్రికా స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కులకు పూర్తి విరుద్ధమని కమిటీ పేర్కొంది.

➡️