జపాన్‌లో రన్‌వేపై రెండు విమానాలు డీ .. ఐదుగురు మృతి

Jan 2,2024 22:05 #airport, #Japan

టోక్యో : టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. జపాన్‌ కోస్ట్‌ గార్డ్‌్‌ విమానంతో పాసింజర్‌ విమానం ఢకొీనడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో పూర్తిగా మంటలు వ్యాపించడానికి ముందుగానే అందులోని 379మంది ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయినట్లు ఎన్‌హెచ్‌కె టివి తెలియజేసింది. జపాన్‌ కోస్ట్‌ గార్డ్‌ విమానం పైలట్‌ కూడా ఈ ప్రమాదం నుండి తప్పించుకోగలిగారని కోస్ట్‌ గార్డ్‌ అధికారులు చెప్పారు. విమానంలోని ఐదుగురు సిబ్బంది చనిపోయినట్లు టివి వార్తలు తెలిపాయి. జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం రన్‌వే పై వుండగానే పెద్ద ఎత్తున మంటలు, పొగ కమ్ముకోవడం స్థానిక టివి దృశ్యాల్లో కనిపిస్తోంది. విమానం రెక్కకు నిప్పంటుకోవడం, ఒక గంట తర్వాత మొత్తంగా మంటల్లో విమానం చిక్కుకోవడం కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన ఎయిర్‌బస్‌ ఎ-350 షిన్‌ చిటసె విమానాశ్రయం నుండి హనెడా విమానాశ్రయానికి ప్రయాణించింది. తమ విమానం ఎంఎ-722తో ప్రయాణికుల విమానం ఢకొీట్టిందని కోస్ట్‌ గార్డ్‌ ప్రతినిధి యోషినొరి యాంగ్‌షిమా ధ్రువీకరించారు. కోస్ట్‌ గార్డ్‌ విమానం భూకంప బాధితుల కోసం సహాయాన్ని తీసుకుని నైజీరియా వెళ్లాల్సి వుంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలోనే వున్న ప్రయాణికుడు స్వీడ్‌ ఆంటన్‌ మాట్లాడుతూ, ఢ కొట్టిన వెంటనే కొద్ది నిముషాల వ్యవధిలో కేబిన్‌ అంతా పొగ కమ్ముకుపోయిందని, వెంటనే అత్యవసర ద్వారాలు తెరుచుకున్నాయని, తమను కిందకు దింపివేశారని చెప్పారు. అసలేం జరుగుతోందో కొద్ది సేపు అర్థం కాలేదని, అదొక భయంకరమైన అనుభవమని స్వీడ్‌ వ్యాఖ్యానించారు.జపాన్‌ భూకంపంలో 48కి పెరిగిన మరణాలుఅపార నష్టం జరిగిందన్న ప్రధాని కిషిదాకనజవా : కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే వరుస భూప్రకంపనలతో పెను విషాదాన్ని చవిచూసిన సెంట్రల్‌ జపాన్‌లో ఇప్పటివరకు 48 మంది మరణించారు. వందలాది భవనాలు, వాహనాలు, బోట్లు ధ్వంసమయ్యాయి. 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంతో పశ్చిమ తీర ప్రాంతం అతలాకుతలమైంది. మంగళవారం కూడా ప్రకంపనల తీవ్రత కొనసాగుతూనే వుండడంతో ఇళ్లల్లో వుండవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. భూంకంపం వల్ల సంభవించిన నష్టం అపారంగా వుందని ప్రధాని ఫ్యుమియో కిషిదా హెచ్చరించారు. కొన్ని మారుమూల ప్రాంతాలకు సహాయక బృందాలు వెళ్లడానికి పలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. దీనివల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా వుందని ఆందోళన వ్యకం చేశారు. శిధిలాల్లో వున్న వారి ఆచూకీ కోసం అన్వేషించడం, కాపాడడం పెను సవాలుగా మారిందని వ్యాఖ్యానించారు. పైగా భూకంపం ప్రధానంగా సంభవించిన నోటో ద్వీపకల్పంలో ఉత్తర ప్రాంతానికి చేరుకోవడం దుర్లభంగా మారిందని, అక్కడ అనేక అగ్ని ప్రమాదాలు సంభవించడం, తీవ్ర విధ్వంసం చోటుచేసుకోవడంతో పరిస్థితి భయానకంగా వుందని అన్నారు. రహదారులు తీవ్రంగా దెబ్బతినడం, రవాణా సదుపాయాలు లేకపోవడంతో జరిగిన నష్టం ఎంత అనేది అంచనా వేయడం కూడా కష్టమైపోతోందని అధికారులు పేర్కొంటున్నారు. తొలుత జారీ చేసిన సునామీ హెచ్చరికను మంగళవారం ఉదయం అధికారులు ఉపసంహరించుకున్నారు. తీర ప్రాంత పట్టణమైన సుజులో దాదాపు వెయ్యికి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని నగర మేయర్‌ మషురో ఇజుమియా తెలిపారు. పెను విపత్తే ఇదని ఆయన వ్యాఖ్యానించారు. భూంకంపం కారణంగా వేలాది ఇళ్లు అంథకారంలో మగ్గుతున్నాయి. నోటో ద్వీపకల్పంలోని పలు ప్రాంతాల్లో తాగు నీరు కూడా లేకుండా పోయింది. భూకంప వార్త తెలియగానే అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సహా పలు దేశాల నేతలు తమ సంతాప సందేశాలు పంపారు. జపాన్‌కు అవసరమైన సాయం అందించడానికి ముందుకు వచ్చారు.

➡️