తూర్పు రఫాపై బాంబుల వర్షం

May 12,2024 09:49 #Bombs rain, #East Rafah

సెంట్రల్‌ రఫాను ఖాళీ చేయాలంటూ తాజాగా హుకుం
ఉత్తర గాజాలో పెరుగుతున్న ప్రతిఘటన
రఫా: ఐక్యరాజ్యసమితి హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గత వారం రోజులుగా రఫాపై నాన్‌స్టాప్‌గా బాంబు దాడులు చేస్తున్న ఇజ్రాయిల్‌ శనివారం వీటిని మరింత తీవ్రతరం చేసింది. తూర్పు రఫానుంచి ఇప్పటికే లక్ష మందికిపైగా ఆకలితో అలమటిస్తున్న ప్రజలను బలవంతంగా తరిమేసిన ఇజ్రాయిల్‌, తాజాగా సెంట్రల్‌ రఫా ప్రజలపై పడింది. వారిని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని కరపత్రాలు, సోషల్‌ మీడియా ద్వారా హుకుం జారీ చేసింది. చికాగో జనసాంద్రత కన్నా నాలుగు రెట్లు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఉత్తర గాజాలో దాడుల సందర్భంగా అక్కడి నుంచి తరలివచ్చిన 15 లక్షల మంది తలదాచుకుంటున్నారు. వీరిలో 6 లక్షల మంది దాకా పిల్లలు ఉన్నారు. నీరు, ఆహారం, కరెంటు వంటి కనీస వసతులు లేని గుడారాల్లో ఎలాగో ఒకలా బతుకీడ్చుతున్న వీరిని అక్కడ నుంచి కూడా నిర్దాక్షిణ్యంగా తరిమేస్తున్నారు. దీంతో వారు గాడిదలపైన, రిక్షాలపైన ఇంటి సామగ్రిని వేసుకుని కాలినడకన వెళుతున్న హృదయవిదారక దృశ్యాలు ఇప్పుడక్కడ సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు. వీరు స్వచ్ఛమైన గాలి, నీరుకు నోచుకుని ఎన్నాళ్లయిందో! ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న జనాభాలో 80 శాతం మంది గాజాలోనే ఉన్నారంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రోజూ 30 వేల మంది ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నట్టు ఐరాస సహాయక సంస్థ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) తెలిపింది.
ఇదిలా వుండగా ఉత్తర గాజాలో హమాస్‌ తన శక్తినంతటినీ కూడదీసుకుని శత్రు బలగాలపై ఎదురు దాడులు చేయనారంభించింది. ఇజ్రాయిల్‌ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్‌ దాడులకు దిగింది. కరెం అబూ షలేమ్‌ క్రాసింగ్‌ వద్ద హమాస్‌ జరిపిన మోర్టార్ల దాడులు ఇజ్రాయిల్‌ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రఫాలో విజయం అంత తేలికేమీ కాదని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.
రఫాలో దాడికి వ్యతిరేకంగా
యెమెన్‌లో భారీ ర్యాలీ
రఫాలో ఇజ్రాయిల్‌ దాడులను వ్యతిరేకిస్తూ యెమెన్‌ రాజధాని సనాతో సహా అన్ని ముఖ్యమైన నగరాల్లోను శుక్రవారం భారీ ర్యాలీలు జరిగాయి. గాజాలో పాలస్తీనీయులు విజయం సాధించేంతవరకు వారికి తమ పూర్తి మద్దతు ఉంటుందని నిరసనకారులు తెలిపారు. ఎర్ర సముద్రంలో ఇజ్రాయిల్‌ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నాల్గవ దశ సైనిక కార్యకలాపాలను చేపడతామని చెప్పారు.
అమెరికాలో 3వేల మంది విద్యార్థుల అరెస్టు
గాజాకు సంఘీభావంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యూనివర్సిటీ విద్యార్థులపై బైడెన్‌ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 3వేల మందిని అరెస్టు చేసినట్లు ఎపి వార్తా సంస్థ తెలిపింది. కొలంబియా, మాసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటి), కేంబ్రిడ్జి, హార్వర్డ్‌, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలో పాల్గన్న విధ్యార్థులపై సస్పెన్షన్‌ వేటు వేయడం, డిగ్రీలు ఇవ్వకుండా నిలిపివేయడం, హాస్టల్స్‌ నుంచి వెళ్లగొట్టడం, యూనివర్సిటీ నుంచి బహిష్కరించడం వంటి చర్యలకు యాజమాన్యాలు పాల్పడుతున్నాయి. అయినా, విద్యార్థులు లెక్క చేయకుండా తమ పోరాటాన్ని క్యాంపస్‌ల నుండి వీధుల్లోకి తీసుకెళ్తున్నారు.

➡️