సంయమనం పాటించండి !

Apr 16,2024 00:24 #Israel and Hamas, #issrel, #War
  •  ప్రపంచ నేతల విజ్ఞప్తి
  •  ఇజ్రాయిల్‌ ఎదురు దాడికి సహకరించం: అమెరికా
  • ఇరాన్‌పై ఆంక్షలకు సిద్దమన్న ఇటలీ

గాజా : ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ ప్రతీకార దాడి జరిపిన నేపథ్యంలో దీనిపై ఎలా ప్రతిస్పందించాలనే అంశంపై ఇజ్రాయిల్‌ వార్‌ కేబినెట్‌ సోమవారం చర్చించింది. పశ్చిమాసియాలో ఉద్రికత్తలు పెచ్చరిల్లకుండా నివారించేందుకు మొత్తంగా అన్ని పక్షాలు సంయమనం పాటించాల్సిన అవసరం వుందని ఐక్యరాజ్య సమితి చీఫ్‌ ఆంటోని గుటెరస ఉద్బోధించారు. రష్యా కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని చైనా ఇంతకుముందే కోరింది. ఇజ్రాయిల్‌కు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తన సంఘీభావం తెలియజేశారు. బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఆయన మట్లాడుతూ, అన్ని పక్షాలు సంయమనం పాటించాల్సిన అవసరం వుందన్నారు. ఇరాన్‌, ఇజ్రాయిల్‌లతో సహా సంబంధిత పక్షాలన్నీ కూడా గరిష్టంగా సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా వుందని ఇరాక్‌ డిప్యూటీ ప్రధాని మహ్మద్‌ అలీ తమిమ్‌ పేర్కొన్నారు. ఈ ఉద్రికత్తలన్నీ ఈ ప్రాంతంలో విస్తృత యుద్ధానికి దారి తీయగలవని ఇరాక్‌ ప్రభుత్వం హెచ్చరించింది. దానివల్ల అంతర్జాతీయ భద్రతకు, సుస్థిరతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా-ఇరాక్‌ ఉన్నత సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభంలో ఇరాక్‌ డిప్యూటీ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దౌత్య నిబంధనలను, అంతర్జాతీయ చట్టాలను గౌరవించి, అన్ని పక్షాలు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు. శని, ఆదివారాల్లో ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ జరిపిన దాడుల నేపథ్తయంలో ఇరాన్‌పై కొత్తగా ఆంక్షలు విధించాలని యోచిస్తున్నట్లు జి 7కి అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్న ఇటలీ తెలిపింది. హమాస్‌కు, తీవ్రవాదానికి మద్దతిచ్చే వారిపై మరిన్ని ఆంక్షలు అవసరమైనట్లైతే దానిపై సీరియస్‌గా ఆలోచించి చర్యలు చేపట్టడానికి సిద్ధమని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటానియో తజని చెప్పారు. ఇరాన్‌ దాడిని పెద్ద తప్పుగా ఆయన అభివర్ణించారు. మొత్తంగా మధ్య ప్రాచ్యంలో నెలకొన్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని లెబనాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

➡️