Loksabha: భారత్‌ హిందూ రాష్ట్ర కాదు.. ఎన్నికల ఫలితాలు దీనినే స్పష్టం చేశాయి

-ధనికులు, పేదల మధ్య అంతరం పెరుగుతోంది
-ఈ క్యాబినెట్‌ పాత దానికి నకలే
-విచారణ లేకుండానే జైళ్లలో నిర్బంధిస్తున్నారు
-భారతీయ గుర్తింపును నిర్లక్ష్యం చేస్తున్నారు
-నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌
కొల్‌కతా : భారతదేశం ‘హిందూ రాష్ట్ర’ కాదని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ వ్యాఖ్యానించారు. విచారణ జరపకుండా ప్రజలను కటకటాల వెనుక ఉంచడం బ్రిటీష్‌ కాలం నుండీ కొనసాగుతోందని, కాంగ్రెస్‌ పాలనలో కంటే బిజెపి ప్రభుత్వ హయాంలోనే ఈ ధోరణి అధికంగా ఉన్నదని ఆయన చెప్పారు. కొల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆయన ఓ బెంగాలీ న్యూస్‌ ఛానల్‌ ప్రతినిధితో మాట్లాడారు. 90 సంవత్సరాల వయసు కలిగిన ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ బుధవారం సాయంత్రం అమెరికా నుండి కొల్‌కతా వచ్చారు. ‘ఎన్నికలు జరిగిన ప్రతిసారీ మార్పు కన్పించాలని మనం కోరుకుంటాం. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలో విచారణ లేకుండా ప్రజలను జైళ్లలో నిర్బంధించడాన్ని మనం చూశాం. ధనికులు, పేదల మధ్య అంతరం పెరిగిపోయింది. అది ఇప్పుడు మరింత పెరిగింది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది’ అని అమర్త్యసేన్‌ తెలిపారు. భారత్‌ లౌకిక దేశమని, దీనికి లౌకిక రాజ్యాంగం ఉన్నదని, కాబట్టి దేనినైనా అంగీకరించే రాజకీయ లక్షణం ఉండాలని ఆయన అన్నారు. భారత్‌ను హిందూ రాష్ట్రగా మార్చాలన్న ఆలోచన సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్రంలో కొత్తగా ఏర్పడిన క్యాబినెట్‌ పాత మంత్రిమండలికి నకలేనని అమర్త్యసేన్‌ వ్యాఖ్యానించారు. ‘మంత్రులు అవే శాఖల్లో కొనసాగుతున్నారు. కొద్దిపాటి మార్పులు మినహా రాజకీయంగా శక్తివంతులైన వారు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నారు’ అని చెప్పారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను అమర్త్యసేన్‌ గుర్తు చేసుకుంటూ అప్పుడు బ్రిటీష్‌ పాలనలో ఎలాంటి విచారణలు జరపకుండానే ప్రజలను కారాగారాల్లో బంధించే వారని తెలిపారు. ‘నేను యువకుడిగా ఉన్నప్పుడు నా బంధువులు అనేక మంది ఎలాంటి విచారణను ఎదుర్కోకుండానే జైలుకు వెళ్లారు. స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న దేశంలో ఇలా జరగకూడదని మేము ఆశించాం. అయితే ఈ ధోరణిని అడ్డుకోవడంలో విఫలమైన నాటి కాంగ్రెస్‌ను కూడా నిందించాల్సి ఉంటుంది. వారు దానిని మార్చలేకపోయారు. కానీ ప్రస్త్త్తుత ప్రభుత్వ పాలనలో ఇది మరింతగా ప్రబలిపోయింది’ అని వివరించారు.
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించినప్పటికీ ఫైజాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని బిజెపి కోల్పోవడంపై ఆయన మాట్లాడుతూ దేశం యొక్క నిజమైన గుర్తింపును మరుగుపరచేందుకు ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. ‘భారత్‌ను హిందూ రాష్ట్రగా చిత్రీకరించేందుకు బాగా డబ్బు ఖర్చు చేసి రామమందిరాన్ని నిర్మించడం మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్‌ ఠాకూర్‌, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌లు జన్మించిన ఈ దేశంలో జరిగి ఉండకూడదు. నిజమైన భారతీయ గుర్తింపును నిర్లక్ష్యం చేసేందుకు జరిగిన ప్రయత్నంగా దీనిని భావించాలి. దీనిని మార్చాల్సి ఉంది’ అని అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని, ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్య రక్షణ వంటి రంగాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అమర్త్యసేన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

➡️