కరాచీలో భారీ వర్షాలు – అంధకారంలోనే గడిపిన ప్రజలు..!

Feb 4,2024 11:43 #darkness, #heavy rains, #Karachi, #people

కరాచీ (పాకిస్థాన్‌) : పాకిస్థాన్‌లోన కరాచీ సహా పలు నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం సాయంత్రం నుండి భారీ వర్షాలు కురవడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఫిబ్రవరి 4న నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని పాకిస్థాన్‌ వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. పాకిస్థాన్‌ వాతావరణ శాఖ సూచన ఉన్నప్పటికీ, సింధ్‌ ప్రభుత్వం వర్షాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

భారీ వర్షాల కారణంగా … పాకిస్థాన్‌ పరిస్థితి మరింత దారుణంగా మారింది. కరాచీ సహా పలు నగరాల్లో రాత్రంతా వర్షం కురవడంతో వరదలు వచ్చే పరిస్థితి నెలకొంది. వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇంతలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి ప్రజలు రాత్రంతా అంధకారంలోనే గడిపారు. కరాచీలోని 700 పవర్‌ ఫీడర్లు నిలిచిపోయాయి. దీంతో సగానికిపైగా నగరం అంధకారంలో కూరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇళ్లు, ఆసుపత్రుల్లోకి వర్షం నీరు చేరిందని స్థానిక మీడియా పేర్కొంది. పలు ప్రాంతాలను వాన ముంచెత్తింది. ప్రయాణికులు వారి వాహనాలలోనే చిక్కుకుపోయారు. కరాచీ మేయర్‌ ముర్తాజా వహాబ్‌, భారీ వర్షాల తర్వాత నగరంలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు. కొన్ని నీటి పంపింగ్‌ స్టేషన్లు పనిచేయడం ఆగిపోయాయని తెలిపారు. వర్షపు కాలువలు పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లో మేయర్‌ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రోడ్లపై వర్షపు నీటిని తొలగించాలని అన్ని జిల్లాల మున్సిపల్‌ కార్పొరేషన్లను ఆదేశించారు.

➡️