ఇరాన్‌పై నేరుగా దాడికి దిగుతాం : ఇజ్రాయిల్‌ బెదిరింపు

Apr 12,2024 08:22 #israel hamas war, #issrel

జెరూసలెం : ఇరాన్‌ తన భూభాగం నుండి ఇజ్రాయిల్‌పై గనుక దాడి చేసినట్లైతే తాము ఇరాన్‌పై ప్రత్యక్షంగా దాడికి దిగుతామని ఇజ్రాయిల్‌ బెదిరించింది. సిరియాలో ఇరాన్‌ కాన్సులేట్‌ కార్యాలయం పేలుడులో ఇరాన్‌ జనరల్స్‌ చనిపోయిన నేపథ్యంలో ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. ఈనెల ఆరంభంలో డమాస్కస్‌లో తమ కాన్సులేట్‌పై దాడికి కచ్చితంగా ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ మత పెద్ద ఆయతుల్లా అలీ ఖమేని పునరుద్ఘాటించారు. ఈ తరుణంలో ఇజ్రాయిల్‌ హెచ్చరిక వెలువడింది. ఆ దాడికి ఇజ్రాయిల్‌ కారణమని ఇరాన్‌ ఆరోపిస్తోంది. ఆ దాడిలో 12మంది చనిపోయారు. ఈ దాడిలో తమ ప్రమేయం వుందని ఇజ్రాయిల్‌ ప్రకటించలేదు. అమెరికా మాత్రం ఇజ్రాయిల్‌ ఈ దాడికి బాధ్యత వహించాలని పేర్కొంది. రంజాన్‌ ప్రార్ధనల సందర్భంగా ఆయతుల్లా ఖమేని మాట్లాడుతూ, కాన్సులేట్‌ కార్యాలయంపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడి చేసి తప్పు చేసిందని, ఇది, ఇరాన్‌ భూభాగంపై దాడి చేసినట్లే తాము భావిస్తున్నామని అన్నారు. ఇజ్రాయిల్‌ ప్రభుత్వం ఇందుకు శిక్ష అనుభవించాలని అన్నారు. అయితే ఏ రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామో చెప్పలేదు. గాజాలో యుద్ధానికి ఇజ్రాయిల్‌కు ఈ దేశాలు సాయం చేస్తున్నాయంటూ పశ్చిమ దేశాలను కూడా ఆయతుల్లా విమర్శించారు

➡️