ఎన్నికల ముంగిట హర్యానా సంక్షోభం

May 12,2024 23:29 #Haryana

– పది స్థానాలున్న రాష్ట్రంలో మే 25న పోలింగ్‌
– ప్రభావం పడుతుందని బిజెపి బెంబేలు
ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :హర్యానాలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల సమయాన బిజెపికి తలనొప్పిగా తయారైంది. పది లోక్‌సభ స్థానాలున్న హర్యానాలో ఈనెల 25న ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి. హర్యానాలో ఇటీవల ముగ్గురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్‌సింగ్‌ సైనీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మైనారిటీలో పడింది. ప్రభుత్వానికి బలం లేదనీ, రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్‌, బిజెపి మాజీ భాగస్వామి జెజెపి డిమాండ్‌ చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఈ పరిణామం బిజెపిని కలవర పరుస్తోంది. హర్యానా ముఖ్యమంత్రి పదవికి మనోహర్‌లాల్‌ కట్టర్‌తో రాజీనామా చేయించి ఆయన స్థానే సైనీని ఇటీవల బిజెపి అధిష్టానం ప్రతిష్టించింది.
వేడెక్కిస్తున్న పరిణామాలు
హర్యానాలో ఏడుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఇండిపెండెంట్లు మంత్రి పదవులను ఆశించారు. ఇందుకు బిజెపి అధిష్టానం నుంచి అనుమతి లభించలేదు. దాంతో వారు సైనీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. హర్యానా అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 90 కాగా, బిజెపి బలం 39. ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతు ఉప సంహరణతో బలం 36కి తగ్గింది. బిజెపి తన బల నిరూపణకు 45 మంది ఎంఎల్‌ఎలు అవసరం. కాగా, ఇప్పటి వరకూ బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన మాజీ ఉప ప్రధాని దేవీలాల్‌ మనవడు, జెజెపి అధ్యక్షుడు దుష్యంత్‌ చౌతాలా పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలిస్తే ఆ పార్టీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని దుష్యంత్‌ చౌతాలా ఇప్పటికే ప్రకటించారు.
సర్వశక్తులూ ఒడ్డుతున్న కమలం
బిజెపి తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. గవర్నర్‌పై కేంద్రం నుంచి ఒత్తిడి ఉందని కాంగ్రెస్‌ పేర్కొనగా, అదేమీ లేదని బిజెపి ఖండిస్తోంది. మొత్తం మీద హర్యానాలో రాజకీయ అస్థిరత నెలకొంది. హర్యానా ఆది నుంచి రాజకీయ అస్థిరతకు పేరొందింది. రావు బీరేందర్‌ సింగ్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు పార్టీలను అతి సునాయాసంగా మారేవారు. పొద్దున ఒక పార్టీలో, రాత్రి మరో పార్టీలో ఉండేవారు. ప్రభుత్వాన్ని కాపాడు కోవడానికి ఫిరాయింపులను ప్రోత్సహించడంలో బిజెపి కాంగ్రెస్‌ని మించి పోయింది. దేవీలాల్‌, బన్సీలాల్‌, భజన్‌లాల్‌ వంటి హేమాహేమీల హయాంలోనూ ఎమ్మెల్యేలు పార్టీలను ఫిరాయించడం హర్యానాలో రికార్డు సృష్టించింది.

➡️