ద్విముఖ పోటీ

May 12,2024 23:23 #chandighad

-మేయర్‌ ఎన్నికల్లో బిజెపి అక్రమాలను అడ్డుకున్న సుప్రీం కోర్టు
– ఆ ప్రభావం ఎంపి ఎన్నికలపైన శ్రీ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ కూడా.. శ్రీ ఈసారి ఆప్‌ మద్దతుతో కాంగ్రెస్‌ పోటీ
పంజాబ్‌, హర్యానాల ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో కాంగ్రెస్‌, బిజెపిల మధ్య పోటీ నెలకొంది. ఈ కేంద్రపాలిత ప్రాంత నియోజకవర్గానికి ఏడవ దశలో జూన్‌ 1న ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఆమ్‌ ఆద్మీ పార్టీ బలం పుంజుకుంది. గత ఏడాది జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ ఫుల్‌ మెజారిటీ సాధించి బిజెపికి షాక్‌ ఇచ్చింది. అయితే లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌కు పట్టు ఉండటంతో ఇండియా బ్లాక్‌లో సీట్ల సర్దుబాటులో భాగంగా మనీష్‌ తివారీని కాంగ్రెస్‌ బరిలోకి దించింది. చండీగఢ్‌లో ఆప్‌,కాంగ్రెస్‌ కూటమిగా పంజాబ్‌లో విడిగా పోటీ పడుతున్నాయి. చండీగఢ్‌లో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఏడుసార్లు, బిజెపి నాలుగు సార్లు, భారతీయ జన సంఫ్‌ు, జనతా దళ్‌, జనతా పార్టీ ఒక్కోసారి గెలుపొందాయి.
ఎక్కువసార్లు కాంగ్రెసే
బిజెపి తొలుత సిట్టింగ్‌ ఎంపి కిర్రాణ్‌కేర్‌కే సీటు కేటాయించినా తదుపరి హిమాచల్‌ప్రదేశ్‌ బిజెపి కో-ఇన్‌ఛార్జ్‌ సంజరు తండన్‌ను నియమించింది. శిరోమణి అకాలీ దళ్‌ అభ్యర్థి హర్దీప్‌ సింగ్‌ సైనీ పోటీ చేస్తారనుకోగా, నామినేషన్ల ముందురోజు పార్టీకి రాజీనామా చేసి తప్పుకున్నారు. ఆయన బిజెపిలో చేరనున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆప్‌ విడిగా పోటీ చేశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కిర్రాణ్‌ కేర్‌ గెలుపొందారు. కాంగ్రెస్‌ నుంచి పవన్‌ బెన్సాల్‌ చండీగఢ్‌లో ఎక్కువ కాలం ఎంపిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో మనీష్‌ తివారీ తరుఫున, పవన్‌ బెన్సాల్‌ సతీమణి, కూతురు ప్రచారంలో పాల్గొంటున్నారు. నిరుద్యోగం, మహిళల సమస్యలు, పంజాబ్‌ యునివర్శిటీ విద్యార్థుల సమస్యలు వంటి వాటిని ఎజెండాగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు.
మెజార్టీ అర్బన్‌ ఓటర్లు
మెజారిటీ అర్బన్‌ ఓటర్లదే పైచేయి. 2.8 శాతం రూరల్‌ ఓటర్లు, 18.9 శాతం షెడ్యూల్‌ కులాల ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 80 శాతం హిందూ ఓటర్లు, 15 శాతం సిక్కు ఓటర్లు ఉన్నారు. రైతుల ఆందోళన ఉద్యమం ప్రభావం పడనుంది.
బిజెపి అక్రమాలు
2023 ఫిబ్రవరిలో జరిగిన చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికల్లో చట్టాలకు పాతరేసిన బిజెపి తీవ్ర అక్రమాలకు పాల్పడింది. ఈ స్థానంలో ఇండియా బ్లాక్‌లో భాగంగా కాంగ్రెస్‌, ఆప్‌లు తమ సంయుక్త అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ను నిలబెట్టాయి. దీంతో కాంగ్రెస్‌-ఆప్‌ గెలిస్తే దాని ప్రభావం లోక్‌సభ ఎన్నికపై పడుతుందేమోనని బిజెపి అక్రమాలకు ఒడిగట్టింది. ఏకంగా బ్యాలెట్‌ పత్రాలనే ట్యాంపరింగ్‌ చేసి దొడ్డిదారిన బిజెపి అభ్యర్థిని ఎన్నుకుంది. ఈ చర్యపై సుప్రీంకోర్టు స్పందించి మేయర్‌ మనోజ్‌ సోంకార్‌ ఎన్నిక సరైంది కాదని తీర్పు చెప్పింది. కాంగ్రెస్‌, ఆప్‌ కూటమి అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని మోడీ నోరుమెదపలేదు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో ఆప్‌ 135 సీట్ల భారీ మెజారిటీ సాధించింది. అక్రమ కేసులను పెట్టి ఆప్‌ అధ్యక్షుడు కేజ్రివాల్‌ను అరెస్టు చేసింది.ఆ ప్రభావం చండీగఢ్‌ లోక్‌సభ ఎన్నికలపై పడనుందని విశ్లేషకులు అంటున్నారు.

ఎలక్షన్‌ డెస్క్‌

➡️