విశ్వవిద్యాలయాల్లో ప్రయివేటు వద్దు – గ్రీస్‌లో వేలాది మంది విద్యార్థుల ప్రదర్శన

ఏథెన్స్‌ : ప్రయివేటు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు జారీ చేసే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని గ్రీస్‌లోని మితవాద ప్రభుత్వాన్ని విద్యార్థులు హెచ్చరించారు. ప్రయివేటీ వర్సిటీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ శుక్రవారం ఏథెన్స్‌ సహా పలు ప్రధాన విశ్వవిద్యాలయాల వల్ల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సెంట్రల్‌ ఏథెన్స్‌లో గురువారం నిర్వహించిన ప్రదర్శనలో వేలాది మంది విశ్వవిద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు. ఏథెన్స్‌లోని ప్రధాన యూనివర్శిటీ భవనం ప్లేటో, సోక్రటీస్‌ విగ్రహాల మీదుగా ఈ నిరసన ప్రదర్శన సాగింది. 2023లో భారతీ మెజారిటీతో విజయం సాధించడాన్ని అవకాశంగా తీసుకుని ప్రధాని కిరియాకోస్‌ మిత్సోటకిస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా తీసుకోబోయే ఈ చర్య వల్ల వేలాది మంది గ్రీకులు ప్రతి ఏటా విదేశాలకు వెళ్లకుండా ఆపడానికి వీలుంటుందని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ దీనివల్ల ప్రభుత్వ వర్శిటీలు దెబ్బ తింటాయని దీన్ని వ్యతిరేకించే వాళ్ళు వాదిస్తున్నారు. ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్శిటీలు ఇంకా ఇక్కట్ల పాలవుతాయంటున్నారు. చట్టపరమైన సంస్కరణలు, జీవన వ్యయ సంక్షోభం వల్ల ఇటీవలి వారాల్లో వివిధ గ్రూపుల నుండి ప్రభుత్వం నిరసనలను ఎదుర్కొంటోంది. సెంట్రల్‌ గ్రీస్‌లో గురువారం రైతులు ట్రాక్టర్లతో హైవేలను దిగ్బంధించారు. తమ ఉత్పత్తి వ్యయాలను తగ్గించేందుకు ప్రభుత్వం అదనంగా సాయం చేయాలని వారు కోరుతున్నారు.

➡️