అసలైన ఉగ్రవాది నెతన్యాహునే !

Feb 5,2024 10:20 #israel hamas war, #Palestine
The real terrorist is Netanyahu!

పీపుల్స్‌ డిస్పాచ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పాపులర్‌ ఫ్రంట్‌ ఫర్‌ ది లేబరేషన్‌ ఆఫ్‌ పాలస్తీనా నేత హేథమ్‌ ఆబ్డో

గాజా: అక్టోబరు 7న జరిగిన దాడిని చూపి పాలస్తీనా ప్రతిఘటన శక్తులను ఉగ్రవాదులని అమెరికా,ఇతర పశ్చిమ దేశాలు ముద్ర వేస్తున్నాయి. ఇది నిజం కాదు, అసలైన ఉగ్రవాది యూదు దురాక్రమణదారుడైన ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహునే అనిపాపులర్‌ ఫ్రంట్‌ ఫర్‌ ది లేబరేషన్‌ ఆఫ్‌ పాలస్తీనా నేత హేథమ్‌ ఆబ్డో అన్నారు. ఆయన పీపుల్స్‌ డిస్పాచ్‌ ప్రతినిధి బ్రియాన్‌ బెకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం స్పష్టం చేశారు. ఉగ్రవాది గురించి మాట్లాడేటప్పుడు ఉగ్రవాదికి నిర్వచనం ఏమిటో తెలుసుకోవాలి. తమ మాతృభూమిని రక్షించుకోవడం కోసం పోరాడేవారు తీవ్రవాదా? ప్రజల కోసం యుద్ధం చేసేవారు ఉగ్రవాదులా? లేక మా భూములను దౌర్జన్యంగా లాక్కొని, మా ప్రజలను ముఖ్యంగా పిల్లలు, మహిళలు అనే విచక్షణ లేకుండా ఊచకోత కోసేవాడు ఉగ్రవాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ‘యుద్ధోన్మాది నెతన్యాహుకు అమెరికన్‌ సామ్రాజ్యవాదం మద్దతు ఇస్తున్నది. తమ మాతృభూమిని పరిరక్షించుకునే హక్కు, మా భూమికి తిరిగి వచ్చే హక్కు మాకు ఉన్నది’ అని ఆయన స్పష్టం చేశారు.

కాల్పుల విరమణ గురించి ప్రస్తావిస్తూ పాలస్తీనా ప్రజలపై దురాక్రమణ ఆపాలి. గాజాలోని ప్రజలకు అవసరమైన ఆహారం, ముందులు, ఇతర నిత్యావసర సరఫరాలను పునరుద్ధరించాలి. ఇజ్రాయిల్‌ దాడుల్లో ధ్వంసమైన మౌలిక వసతుల పునర్నిర్మాణానికి వీలు కల్పించాలి. ఇవన్నీ జరగాలంటే కాల్పుల విరమణ అత్యంతావశ్యకం అని ఆయన చెప్పారు.

నెతన్యాహుకు ఈ యుద్ధం ఆపాలని ఏ కోశానా లేదు. పైగా దీనిని యావత్‌ పశ్చిమాసియా ప్రాంతానికి విస్తరించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ యుద్ధం ముగిసిన మరు క్షణమే అతను జైలుకు వెళ్లడం ఖాయం. ఈ విషయం అతనికి బాగా తెలుసు. అందుకే ఈ యుద్ధాన్ని పొడిగించాలని చూస్తున్నాడు. లెబనాన్‌, సిరియా వంటి దేశాలకు విస్తరించేందుకు యత్నిస్తున్నాడని హేథమ్‌ ఆబ్డో చెప్పారు.

ప్రపంచ ప్రజాభిప్రాయం ఇజ్రాయిల్‌కు, దాని పోషకులైన వాషింగ్టన్‌లోని స్పాన్సరర్లకు వ్యతిరేకంగా ఉంది. నెతన్యాహక మద్దతుగా బైడెన్‌ ప్రభుత్వం ఆయుధాలు, డబ్బు అందజేయడాన్ని వ్యతిరేకిస్తూ వాషింగ్టన్‌లో నవంబరు4న 5లక్షల మంది ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనాకు సంఘీభావంగా జనవరి13న మరోసారి లక్షలాది మందితో ర్యాలీ నిర్వహించారు. ప్రతి రోజూ అమెరికా అంతటా పెద్ద యెత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో గతంలో ఎన్నడూ ఇంతటి భారీ ర్యాలీలు లేవు. ఇది సరికొత్త యుగం. అమెరికాలో మాత్రమే కాదు, బ్రిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ ఇలా అనేక దేశాల్లో పాలస్తీనా సంఘీభావ ర్యాలీలు జరుగుతున్నాయని ఆయనె అన్నారు.

ఇది హమాస్‌పై యుద్ధం, ఉగ్రవాదంపై యుద్ధం అని పశ్చిమ దేశాల ప్రభుత్వాలు, వాటి అధీనంలోని మీడియా బాకాలు అదే పనిగా ఊదరగొడుతున్నాయి. అయితే ఇది నిజం కాదు. ఈ దురాక్రమణదారు దాడి గాజాపైనే కాదు, పాలస్తీనా ప్రజలందరిపైనా అని ఆయన అన్నారు. వెస్ట్‌ బ్యాంక్‌లోను, ఇతర ప్రదేశాల్లోను ఏం జరుగుతుందో చూస్తున్నాం. పాలస్తీనా ప్రజలకు సహాయం అందించే ఐరాస సహాయక సంస్థకు నిధుల్లో పశ్చిమ దేశాలు కోతపెట్టాయి. ఇది పాలస్తీనీయులను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న దాడి కాదా అని ఆయన ప్రశ్నించారు. పాలస్తీనా విమోచనా పోరాటం రాజకీయ సమస్య. సాయుధ పోరాటంతో సహా ఆక్రమణను నిరోధించే హక్కు అంతర్జాతీయ చట్టాలు కల్పిస్తున్నాయి. ఈ విషయం తెలిసి కూడా పాలస్తీనా ప్రతిఘటనా సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రపంచంలోని ప్రధాన సామ్రాజ్యవాద శక్తులైన అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, కెనడా, జపాన్‌ ముద్ర వేయడం వాటి నైజాన్ని తెలియజేస్తోందని హేథమ్‌ ఆబ్డో అన్నారు.

 

➡️