ఖలిస్తానీ వేర్పాటువాది నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్టు

ఒట్టావా : ఖలిస్తాన్‌ వేర్పాటువాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసుతో సంబంధమున్న ముగ్గురు భారత జాతీయులను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. తమ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, ఈ హత్యలో ఇంకా మరింతమంది పాత్ర వుండి వుండవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఎడ్మంటన్‌లో నివసిస్తున్న కరణ్‌ బ్రార్‌ (22), కమల్‌ప్రీత్‌ సింగ్‌ (22), కరణ్‌ప్రీత్‌ సింగ్‌ (28)లపై ఫస్ట్‌ డిగ్రీ హత్య, హత్యకు పాల్పడేందుకు కుట్ర పన్నిన అభియోగాలను నమోదు చేశారు. కెనడా పౌరుడైన నిజ్జర్‌ (45)ను బ్రిటీష్‌ కొలంబియాలోని సర్రేలో గురుద్వారా వెలుపల హత్య చేసేందుకు భారత ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి వుంటుందని భావిస్తున్న బృందంలో వీరు సభ్యులని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తామని దర్యాప్తు బృందం ఇన్‌చార్జి ఆఫీసర్‌ మణ్‌దీప్‌ మూకర్‌ తెలిపారు.

➡️