అరబ్‌ ప్రాంతంలో పెచ్చరిల్లుతోన్న నిరుద్యోగం !

Feb 21,2024 10:25 #ILO, #UAE, #Unemployment rate
unemployment in Arab region
  •  9.8 శాతానికి చేరుతుందంటూ ఐఎల్‌ఓ హెచ్చరిక

బీరుట్‌ : అరబ్‌ ప్రాంతంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) పేర్కొంది. 2024లో ఈ నిరుద్యోగం రేటు 9.8 శాతంగా వుండగలదని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అరబ్‌ లేబర్‌ మార్కెట్‌లో పరిస్థితులు అత్యంత ‘సంక్లిష్టం’గా వున్నందున అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని పిలుపిచ్చింది. అరబ్‌ జాతీయులు, శరణార్ధుల మధ్య తేడాలు చూపడం, గల్ఫ్‌ సహకార మండలి (జిసిసి) దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య తేడాలుండడం వంటి కారణాలు ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది. జిసిసియేతర దేశాలకు, అస్థిరత, ఘర్షణలు, సంక్షోభాలు, బలహీనమైన ప్రైవేటు రంగం, జనాభా ఒత్తిళ్ళు వంటి ఇతర కారణాలు కూడా వున్నాయని నివేదిక పేర్కొంది. అరబ్‌ దేశాల ఉపాధి, సామాజిక దృక్పథం – ధోరణులు 2024 పేరుతో ఐఎల్‌ఓ ప్రాంతీయ డైరెక్టర్‌ జరదత్‌ ఈ నివేదికను విడుదల చేశారు.లేబర్‌ మార్కెట్లలో అవకాశాలను పెంచడానికి అనుసరించాల్సిన పరిష్కారాలను గుర్తించడంలో ఈ నివేదిక ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు జరదత్‌ తెలిపారు. అంతేకాకుండా అరబ్‌ ప్రాంత వ్యాప్తంగా శాంతి, సుస్థిరతలు నెలకొనడానికి కూడా దోహదపడుతుందని అన్నారు. ఉపాధి కావాలనుకునేవారికి అత్యంత నాణ్యమైన ఉద్యోగాలను ఉత్పత్తి చేయడంలో ఆర్థిక వ్యవస్థల అశక్తత వల్లనే ఉపాధి రంగానికి పలు సవాళ్ళు ఎదురవుతున్నాయని నివేదిక పేర్కొంది. పర్యవసానంగా సగానికి పైగా కార్మికులు అనియత, అభద్రత కలిగిన ఉద్యోగాల్లో వుంటున్నారని, వారికి ఎలాంటి సామాజిక భద్రత లేదా ఇతర ప్రయోజనాలు లేవని ఆ నివేదిక పేర్కొంది.

➡️