ఇది కోర్టు గౌరవానికి సంబంధించిన సమస్య

Mar 11,2024 07:59 #judgement, #Supreme Court

ఎవరినో రక్షించడానికి ఎస్‌బిఐ తాప్రతయం

ఎస్‌బిఐ ధిక్కారంపై కపిల్‌ సిబాల్‌

న్యూఢిల్లీ :ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించకుండా ఎస్‌బిఐ కోర్టు ధిక్కారానికి పాల్పడినందున, ఇప్పుడు తన గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుపై ఉందని ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు కపిల్‌ సిబాల్‌ పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి6వ తేదీకల్లా ఎన్నికల సంఘానికి అందజేయాలని సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాన్ని అమలు చేయడానికి బదులు జూన్‌ 30 వరకూ గడువు పొడిగించాలని ఎస్‌బిఐ కోరడాన్ని సిబాల్‌ తప్పుపట్టారు. ఆదివారం నాడు ఒక వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ, డిజిటల్‌ యుగంలో సైతం ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించడానికి అనేక వారాల గడువు కోరడం వెనుక ‘ఎవరినో రక్షించే ఉద్దేశం ఎస్‌బిఐకి ఉందని స్పష్టమవుతోందని అన్నారు. ఆ ఉద్దేశమే లేకపోతే మరో 116 రోజుల గడువు ఎస్‌బిఐ కోరేది కాదని అన్నారు. ఏప్రిల్‌ామేలో ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల బాండ్ల వివరాలు బయటకొస్తే అధికార బిజెపి తీవ్ర ఇరకాటంలో పడుతుందని కూడా ఎస్‌బిఐకి తెలుసని కపిల్‌సిబాల్‌ అన్నారు. అధికారంలో ఉన్న పెద్దల ఆదేశాలతోనే ఎస్‌బిఐ ఈ నాన్పుడు ధోరణినవలంభిస్తోందని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా ఎన్నికల బాండ్ల వివరాలు బయటకు రాకుండా అడ్డుకోడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్ని అడ్డదారులు తొక్కుతోందని ఆయన విమర్శించారు. ఈ విషయంలో ఎస్‌బిఐ ఇచ్చిన విచిత్రమైన వివరణను సుప్రీంకోర్టు అంగీకరిస్తే అది నవ్వులపాలవుతుంది. కాబట్టి తన గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుపై ఉంది అని ఆయన అన్నారు.

➡️