ఎన్నికల వేళ బిజెపికి కోట్లు కుమ్మరింత

Mar 24,2024 00:45 #BJP, #elections, #funds

– 2019 లోక్‌సభ ఎన్నికల్లో కార్పొరేట్‌ కంపెనీల తీరు
– నాడు ఎన్నికల బాండ్లలో 93 శాతం నిధులు కమలానికే
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఆదివాసీల హక్కులను హరించి, పర్యావరణ ధ్వంసానికి ఒడిగట్టి కార్పొరేట్‌ కంపెనీలకు భూములను, ప్రాజెక్టులను కట్టబడెతూ వచ్చిన కేంద్రంలోని అధికార బిజెపికి ఎన్నికలు వచ్చినప్పుడల్లా కార్పొరేట్‌ కంపెనీలు కోట్లాది రూపాయలు విరాళాలుగా కుమ్మరిస్తూ వచ్చాయి. ఎన్నికల బాండ్లను ఇందుకు మార్గంగా మలుచుకున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కూడా కార్పొరేట్‌ కంపెనీలు ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపికి భారీగా నిధులు సమకూర్చాయి. అప్పుడు కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్లలో 93 శాతం నిధులు ఒక్క బిజెపికే చేరాయంటే కార్పొరేట్‌, బిజెపి దోస్తీని అర్థం చేసుకోవచ్చు.
2019 ఏప్రిల్‌ 12 నుంచి 2019 మే 10 మధ్య, 13 రాజకీయ పార్టీలు మొత్తం రూ. 2,902.87 కోట్ల ఎన్నికల బాండ్లను స్వీకరించాయి. వీటిలో అత్యధికం రూ.2,719.32 కోట్లు (93 శాతం) బిజెపి పొందింది. కాంగ్రెస్‌ కేవలం రూ.95.29 కోట్లు (3.2 శాతం) పొందింది. కాగా తృణమూల్‌ కాంగ్రెస్‌కు రూ.36.2 కోట్లు, బిఆర్‌ఎస్‌కు రూ.13.6 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీకి రూ.10 కోట్లు, శివసేనకు రూ.8.45 కోట్లు చొప్పున నిధులు సమకూరాయి. కలకత్తాకు చెందిన పారిశ్రామికవేత్త మహేంద్ర కుమార్‌ జలాన్‌ కి చెందిన సంస్థలు హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళాలు అందించాయి. నాటి ఎన్నికల వేళ బిజెపికి కోట్లు కుమ్మరించిన సంస్థల్లో జలాన్‌కు చెందిన మదన్‌లాల్‌ లిమిటెడ్‌ రూ. 175.5 కోట్లు, కెవెంటర్‌ ఫుడ్‌ పార్క్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ రూ. 144.5 కోట్లు, ఎంకెజె ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ రూ. 14.42 కోట్లు అగ్రస్థానంలో నిలిచాయి. 2019 ఏప్రిల్‌-మే మధ్య బిజెపికి మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ రూ.125 కోట్లు విరాళంగా సమర్పించుకుంది. ఈ కాలంలో బిజెపికి ఇతర అగ్ర దాతలలో వేదాంత లిమిటెడ్‌ రూ.52.65 కోట్లు, ఎస్సెల్‌ మైనింగ్‌ అండ్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ రూ. 50 కోట్లు, బజాజ్‌ గ్రూప్‌, పిహెచ్‌ఎల్‌ ఫిన్‌వెస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒక్కొక్కటి రూ. 40 కోట్లు విరాళంగా అందించాయి. పారిశ్రామికవేత్త లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ రూ.35 కోట్లు ఇవ్వగా, సన్‌ ఫార్మా లేబరేటరీస్‌ లిమిటెడ్‌ రూ.31.5 కోట్లు ఇచ్చింది.
రియల్‌ ఎస్టేట్‌ సమ్మేళనం డిఎల్‌ఎఫ్‌ గ్రూప్‌ (డిఎల్‌ఎఫ్‌ కమర్షియల్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌, డిఎల్‌ఎఫ్‌ లగ్జరీ హౌమ్స్‌ లిమిటెడ్‌) ఎన్నికలకు ముందు బిజెపికి రూ.25 కోట్లు ఇచ్చింది. డిఎల్‌ఎఫ్‌ కేవలం బిజెపికి మాత్రమే ఇచ్చింది. 2019 జనవరిలో భూ కేటాయింపు కేసులో అవకతవకలు జరిగాయని ఆరోపించినందుకు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) డిఎల్‌ఎఫ్‌ కార్యాలయాలు తనిఖీ నిర్వహించింది. 2019 ఏప్రిల్‌, మే మధ్య రూ. 25 కోట్లు విరాళం ఇచ్చింది. అదే సమయంలో, రిలయన్స్‌కి చెందిన ముఖేష్‌ అంబానీ అల్లుడు ఆనంద్‌ పిరమల్‌ డైరెక్టర్‌గా ఉన్న పిరమల్‌ గ్రూప్‌, పిరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ బిజెపికి రూ.20 కోట్లు ఇచ్చింది.

➡️