జైలు నుంచి కేజ్రీవాల్‌ ఆదేశాలపై ఇడి విచారణ

న్యూఢిల్లీ : జైలు నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ జారీ చేసినట్లు చెబుతున్న ఉత్తర్వులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) దృష్టి పెట్టింది. ఒకవేళ కేజ్రీవాల్‌ ఈ ఉత్తర్వులను జారీ చేస్తే అవి ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ (పిఎంఎల్‌ఎ) ప్రత్యేక కోర్టు ఇడికి, కేజ్రీవాల్‌కు ఇచ్చిన ఆదేశాలకు లోబడి ఉన్నాయా.. లేదా అనే విషయంపై విచారణ చేయనుంది.
ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో 55 ఏళ్ల కేజ్రీవాల్‌ను ఈ నెల 21న ఇడి అరెస్టు చేసింది. కోర్టు ఈ నెల 28 వరకూ కేజ్రీవాల్‌కు కస్టడీ విధించింది. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకూ మధ్యలో అరగంట పాటు భార్య సునీతా కేజ్రీవాల్‌, వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ను కలవడానికి కేజ్రీవాల్‌కు అనుమతి ఇచ్చింది. మరో ఆరగంట పాటు తన న్యాయవాదులను కలవడానికి అనుమతి ఇచ్చింది.
కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తనకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఢిల్లీ నీటి పారుదల శాఖ మంత్రి అతిషి ఆదివారం ప్రకటించారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఎదురువుతున్న నీటి, మురుగు నీటి సంబంధిత సమస్యలను పరిష్కరించాలని ఆదేశిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలకు తగినన్ని నీటి ట్యాంకర్లను తరలించాలని కూడా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఈ ఉత్తర్వులపై ఇడి విచారణ చేయనుంది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పన గురించి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ప్రైవేట్‌ భాగస్వాములతో జరిపిన సమావేశాల గురించి ఇడి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి సహాయకులు, సిబ్బంది వినియోగించిన మొబైల్‌ ఫోన్లుపైనా ఇడి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

➡️