నిండు జీవితానికి రెండు చుక్కలు

Mar 4,2024 07:58 #Pulse Polio programme

– దేశవ్యాప్తంగా పల్స్‌ పోలియో ప్రారంభం

ప్రజాశక్తి – న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో:  దేశాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన పల్స్‌ పోలియో కార్యక్రమం ఆదివారం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. దీనికిగాను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని వైద్య ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లోనూ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి చిన్నారులకు చుక్కల మందు వేశారు. రాష్ట్రంలోనూ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. రాజ్‌భవన్‌లో గవర్నరు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన సతీమణి, రాష్ట్ర ప్రథమ మహిళ సమీరా నజీర్‌.. చిన్నారులకు పల్స్‌ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనరు జె నివాస్‌, జెడి (సిహెచ్‌ అండ్‌ఐ) కె అర్జున్‌రావు, స్టేట్‌ ఇమ్యునైజేషన్‌ అధికారి పిఒ ఎల్‌పిహెచ్‌ఎస్‌ దేవి, ఎన్‌టిఆర్‌ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి సుహాసిని, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎఎంహెచ్‌ఒ బాబు శ్రీనివాస్‌, డిఐఎ అమృత పాల్గన్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం 53.35 లక్షల మంది ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు తెలిపారు.

➡️