అక్రమ ట్రస్టుల నుంచి బిజెపికి రూ.614.52 కోట్ల విరాళం!

తిరువనంతపురం : 2021-22 ఒక్క ఏడాదిలోనే కార్పోరేట్లు, వ్యక్తులు, ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి) ఆమోదించని అక్రమ ట్రస్టుల నుండి బిజెపి రూ.614.52 కోట్లు సంపాదించింది. ఎలక్టోరల్‌ బాండ్ల నుండి సంపాదించిన వేలకోట్లకు ఇది అదనమని దేశాభిమాని పత్రిక వెల్లడించింది. 2022 నవంబర్‌ 7న బిజెపి ఎన్నికల కమిషన్‌ (ఇసి)కి సమర్పించిన పత్రాల్లో చాలా మంది దాతల పాన్‌ నెంబర్‌, చిరునామా లేదు. ప్రతి ఆర్థిక సంవత్సరం రాజకీయ పార్టీలు ఇరవై వేలకు పైగా జమ చేసిన వారి జాబితాను ఇసికి సమర్పించాల్సి వుంది. ఇసి ఆమోదించని ఎలక్టోరల్‌ ట్రస్టుల నుంచి బిజెపి విరాళాలను స్వీకరించినట్లు ఆ పత్రాలు చూపుతున్నాయి. వాటిలో ఒకటి జనరల్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ కేరళ. పది లక్షలు విరాళం అందించిన ఈ ట్రస్ట్‌ పాన్‌ నెంబర్‌, చిరునామా లేవు. వివరణ కోరకుండా బిజెపి సమర్పించిన పత్రాలను ఇసి ఆమోదించడం గమనార్హం. న్యూఢిల్లీలోని బహదూర్‌ షా జాఫర్‌ మార్గ్‌లోని హన్స్‌ భవన్‌లో నమోదైన ప్రూడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ 2021-22లో బిజెపి రూ.249 కోట్ల విరాళాలను అందించింది. మొత్తంగా 4,985 మంది ప్రముఖుల (వ్యక్తులు, సంస్థలు, ట్రస్ట్‌లు) నుండి చెక్‌లు, ఆన్‌లైన్‌, నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ (ఎన్‌ఇఎఫ్‌టి)ల ద్వారా బిజెపికి నగదు బదిలీ చేశాయి. కేరళకు చెందిన సంస్థలు, వ్యక్తులతో కూడిన 27 మంది ప్రముఖుల నుండి నగదు అందింది. బిజెపికి కోటి రూపాయలు ఇచ్చిన మహ్మద్‌ మజీద్‌కు సంబంధించిన పాన్‌ నెంబర్‌, చిరునామా లేవు. ఎలక్టోరల్‌ బాండ్ల పేరుతో దేశంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనంత అవినీతికి పాల్పడింది. సుప్రీంకోర్టు తీర్పుతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) వెల్లడించిన వివరాలతో ఈ అక్రమాలు వెలుగుచూశాయి.

➡️