రోజుకో అబద్ధం.. గంటకో విద్వేష బీజం..

May 20,2024 08:23 #coments, #M.K. Stalin, #PM Modi
  •  ప్రధాని మోడీపై స్టాలిన్‌ ఆగ్రహం

చెన్నై : రాష్ట్రాల మధ్య ఘర్షణలు రేపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చౌకబారు ఎత్తుగడలు అవలంబిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌ విమర్శించారు. ఎన్నికల సందర్భంగా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మోడీ ప్రచారం చేస్తున్నారని, అయితే అది బిజెపికి ఏమీ ఉపయోగపడదని అన్నారు. ‘ప్రధాని బాధ్యతారాహిత్యమైన ప్రసంగాలు చేస్తున్నారు. వాటిని అడ్డుకోవడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమవుతోంది. వీటన్నింటినీ దేశ పౌరులందరూ దిగ్భ్రాంతితో, నిస్పృహహతో చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
మోడీ ఊహాజనిత కథలు, పుట్టెడు అబద్ధాలు వల్లె వేస్తున్నారని స్టాలిన్‌ ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌ ప్రజలను ఉద్దేశించి దక్షిణాది ప్రజలు అమర్యాదకరంగా మాట్లాడుతున్నారంటూ మోడీ చేసిన ఆరోపణను ఆయన తోసిపుచ్చారు. ప్రధాని పదవి హుందాతనాన్ని మోడీ మరచిపోయారని, ప్రతి రోజూ ఒక కొత్త అబద్ధం చెబుతున్నారని, గంట గంటకూ విద్వేషపు విత్తనాలు నాటుతున్నారని విమర్శించారు. వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాలు, షెడ్యూల్డ్‌ కులాల రిజర్వేషన్లపై అమలులో ఉన్న 50% పరిమితిని ఎత్తివేయాలని తమిళనాడు, సామాజిక న్యాయం కోసం పనిచేసే రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయని గుర్తు చేశారు. ఈ డిమాండ్‌ను ఇప్పుడు జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్నామని, దీనికి కాంగ్రెస్‌, ఇండియా బ్లాక్‌ మద్దతు ఇచ్చాయని చెప్పారు. ‘ఉత్తరప్రదేశ్‌ ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే ఈ విషయంపై ప్రధాని ఎప్పుడైనా మాట్లాడారా? ఏదైనా గ్యారంటీ ఇచ్చారా?. లేదు. కానీ ఆయన విద్వేషాలను త్వరగా వ్యాప్తి చేయడంలో నిమగమయ్యారు’ అని స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ వార్తలను బిజెపి సమర్ధిస్తోందని, ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ యూట్యూబర్‌ మనీష్‌ కశ్యప్‌ ఉదంతాన్ని ప్రస్తావించారు. మోడీ విద్వేష ప్రచారం విఫలమైందని, తన పది సంవత్సరాల పాలన గురించి ఆయనకు చెప్పుకునేందుకు ఏమీ లేదని అన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రధాని నీరుకారిస్తే పేదలకు శత్రువుగా మారిపోతారని చెప్పారు. తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ఉద్దేశించిన పథకం కారణంగా మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య తగ్గిందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యను స్టాలిన్‌ ప్రస్తావిస్తూ ఈ పథకం ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలకు ఉపయోగపడుతోందని తెలిపారు. మోడీ ప్రసంగాలు వింటే వాటిలో కిలో గ్రామ్‌ నిజానికి ఎంత ఖరీదో అన్న ఆశ్చర్యం కలుగుతుందని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.

➡️