కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయవచ్చు : ఆప్‌ వర్గాలు

న్యూఢిల్లీ :    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని ఆప్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) విచారణకు హాజరుకావడానికి నిరాకరించిన కొన్ని గంటల అనంతరం ఆప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేజ్రీవాల్‌ నివాసంపై ఈడి దాడి చేసే అవకాశం ఉందని, అందుకే ఆయన నివాసానికి వెళ్లే మార్గాలను ఢిల్లీ పోలీసులు బ్లాక్‌ చేశారని ఆవర్గాలు పేర్కొన్నాయి. కేజ్రీవాల్‌ ప్రతిస్పందనను ఈడి న్యాయవాదులు ప రిశీలిస్తున్నారని, తాజాగా మరోసారి ఆయనకు సమన్లు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

గతేడాది నవంబర్‌ 2 మరియు డిసెంబర్‌ 21న విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడి జారీ చేసిన సమన్లను కేజ్రీవాల్‌ తోసిపుచ్చారు. జనవరి 3న మూడోసారి కూడా సమన్లకు హాజరుకానని స్పష్టం చేశారు. అయితే ఈడి తనకు సమన్లు జారీ చేసేందుకు సహేతుక కారణం వెల్లడించలేదని ఈడికి రాసిన లేఖలో కేజ్రీవాల్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈడి ఈ అంశంలో అనవసరమైన గోప్యతను పాటిస్తోందని, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

➡️