ఖర్గేతో భేటీ అయిన ఆప్‌ నేత సంజయ్ సింగ్‌

న్యూఢిల్లీ : ఆప్‌ నేత సంజయ్  సింగ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో సమావేశమయ్యారు. ఆదివారం ఖర్గే నివాసానికి చేరుకున్న ఆయన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.  రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఉమ్మడి కార్యాచరణ  రూపొందించాలని కోరానని అన్నారు.    తాను జైలు నుండి విడుదలైన తర్వాత ఖర్గే మద్దతును కోరానని, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను జైలులో ఎలా ట్రీట్‌ చేస్తున్నారో చెప్పానని సంజయ్  సింగ్‌ పేర్కొన్నారు.  ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని అన్నారు. మోడీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకున్న తీరుపై చర్చించామని అన్నారు. రానున్న ఎన్నికల కోసం ఇండియా కూటమిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఉమ్మడి కార్యాచరణ  ఉండాలని ఖర్గేను కోరినట్లు తెలిపారు.

➡️