ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటాం

  •  సిపిఎం బృందానికి ఇసి హామీ
  •  బిజెపి అక్రమాలను వివరించిన సుభాషిణీ అలీ, మురళీధరన్‌

న్యూఢిల్లీ : బిజెపిపైనా, ఆ పార్టీ ప్రధాన ప్రచారకర్తలపైనా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) చేసిన పలు ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) సానుకూలంగా స్పందించింది. ఫిర్యాదులను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించినవారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
సిపిఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణీ అలీ, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మురళీధరన్‌ సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) ప్రధానకార్యాలయానికి వెళ్లి ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్లతో సమావేశమయ్యారు. బిజెపి అధ్యక్షులు, ఆ పార్టీకి చెందిన ఇరత ప్రచారకర్తలపై సిపిఎం ఫిర్యాదులపై ఎన్నికల సంఘానికి వివరించారు. ముఖ్యంగా మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా బిజెపి నేతలు పదేపదే విద్వేష ప్రసంగాలు చేస్తుండటంపైనా, అవాస్తవాలను చెబుతూ ప్రజలను చీల్చి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బిజెపి పన్నుతున్న కుయుక్తలపైనా ఎన్నికల కమిషనర్ల వద్ద సిపిఎం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు వాస్తవాలను తొక్కిపెట్టి అవాస్తవాలను ప్రచారం చేస్తూ బిజెపి విద్వేష పూరిత కుట్రలకు వంత పాడుతున్న కొన్ని టివి వార్తా ఛానెళ్లు, మీడియా సంస్థల పాత్రపైన కూడా సిపిఎం నేతలు ఆందోళన వెలిబుచ్చారు. ఇలాంటి నేతలపైనా, సంస్థలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ ఫిర్యాదుల పట్ల ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని, ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామన్న హామీ ఇచ్చిందని సమావేశం అనంతరం సిపిఎం నేతలు పేర్కొన్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సహా ఆ పార్టీకి చెందిన ప్రధాన ప్రచారకర్తలు ఎన్నికల ప్రచార సభల్లో విద్వేష ప్రసంగాలు చేయడం, ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మైనార్టీలు వంటి అణగారిన తరగతులకు చెందిన ప్రజలకు అందుతున్న రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించడం, తొలి, మలి విడత పోలింగ్‌ జరిగిన త్రిపుర వంటి చోట్ల బిజెపి అక్రమాలకు పాల్పడటం వంటి ఘటనలపై నిర్దిష్ట సమాచారంతో సోదాహరణంగా సిపిఎం ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.

➡️