సిఎఎ అమల్లోకి వచ్చాక 300మందికి పైగా భారతీయ పౌరసత్వం

May 16,2024 00:20 #300 people, #became, #CAA, #Indian citizens
  • పోర్టల్‌కు 25వేలకు పైగా దరఖాస్తులు

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)-2019పై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తినప్పటికీ వాటిని పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ చట్టం కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో 300మందికి పైగా కేంద్ర ప్రభుత్వం బుధవారం పౌరసత్వ సర్టిఫికెట్లను అందచేసింది. వారిలో 14మందికి ఢిల్లీలో కేంద్ర హోం కార్యదర్శి అజరు భల్లా స్వయంగా సర్టిఫికెట్లను అందచేశారు. ఇలా దరఖాస్తు చేసుకున్నవారు ఏ దేశస్తులనేది తక్షణమే తెలియరాలేదు. అయితే దరఖాస్తుదారుల్లో ఎక్కువమంది పాకిస్తానీ హిందువులే వున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందుగా మార్చి 11వ తేదీన పౌరసత్వ సవరణ నిబంధనలు, 2024ను కేంద్ర హోం శాఖ నోటిఫై చేసింది. దీంతో సిఎఎ అమల్లోకి వచ్చింది. 2019 డిసెంబరులో పార్లమెంట్‌ ఈ చట్టాన్ని ఆమోదించిన నాలుగేళ్ల తర్వాత నిబంధనలను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ దేశాలకు చెందిన ఆరు ముస్లింయేతర కమ్యూనిటీలు -హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్‌, పార్శీ, క్రైస్తవ మతాలకు చెందిన వారిలో ఎలాంటి పత్రాలు లేకుండా డిసెంబరు 31, 2014కి ముందు భారత్‌కు వలస వచ్చేసిన వారు సిఎఎ సెక్షన్‌ 6బి కింద పౌరసత్వం కోసం నమోదు చేసుకోవాల్సి వుంటుంది. ఇందుకు వీలుగా పౌరసత్వ చట్టం, 1955ను సవరించారు. ఇప్పటివరకు పౌరసత్వానికి అర్హులు కావాలంటే భారత్‌లో వరుసగా 11 సంవత్సరాలు వుండాల్సి వుంది. కాగా ఈ కాలాన్ని ప్రస్తుతం ఐదేళ్ళకు తగ్గించారు.
జన గణన కార్యకలాపాల డైరెక్టర్‌ నేతృత్వంలోని సాధికార కమిటీకి పౌరసత్వం మంజూరు చేసే తుది అధికారాన్ని అప్పగించారు. ఇండియన్‌సిటిజన్‌షిప్‌ఆన్‌లైన్‌ డాట్‌ ఎన్‌ఐసి పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులను దాఖలు చేసుకోవాల్సి వుంది. పోస్టల్‌ అధికారుల విభాగం నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ (డిఎల్‌సి) వీటిని నిశితంగా పరిశీలిస్తుంది. డాక్యుమెంట్లన్నింటినీ పరిశీలించి, నిర్ధారించిన తర్వాత డిఎల్‌సి దరఖాస్తుదారులచే ప్రమాణం చేయిస్తుంది. ఇప్పటివరకు ఈ పోర్టల్‌కు 25వేలకు పైగా దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు.
కాగా 14మందికి సర్టిఫికెట్లను అందచేస్తూ అజరు భల్లా, ఈ నిబంధనలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను వివరించారు. పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌, రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️