రాష్ట్ర అంగన్‌వాడీలకు ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ అభినందనలు

Jan 24,2024 10:13 #Anganwadi strike, #CITU

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అంగన్‌వాడీ యూనియన్ల సంయుక్త వేదిక ఆధ్వర్యంలో 42 రోజులుగా సమ్మె చేసి విజయం సాధించిన అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్లకు ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ (ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌) అభినందనలు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ ప్రధాన కార్యదర్శి ఎఆర్‌ సింధు ప్రకటన విడుదల చేశారు. ’42 రోజుల పాటు కొనసాగిన నిరవధిక సమ్మె, 18 రోజుల పాటు ఎస్మాను ధిక్కరించి ఉద్యమించారు. సోమవారం చలో విజయవాడలో సుమారు 8 వేల మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను సామూహికంగా అరెస్టులు చేశారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా అర్ధరాత్రి వరకు ఎపి ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం, అంగన్‌వాడీ యూనియన్లతో చర్చలు జరిపింది. వారి డిమాండ్లన్నింటికీ అంగీకరిస్తూ యూనియన్లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది’ అని తెలిపారు. ‘దేశంలోనే తొలిసారిగా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ఎస్మాను ధిక్కరించి పోరాటం చేయడం, యూనియన్లతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునేలా చేయడం ఇదే తొలిసారి’ అని అన్నారు. సమ్మెకు సంఘీభావంగా వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిలో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని దేశవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ పిలుపునిచ్చింది. జనవరి 23-30 తేదీల్లో మోడీ ప్రభుత్వ చివరి బడ్జెట్‌కు ముందు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో భారీ ప్రదర్శనలు నిర్వహించి, పార్లమెంటు సభ్యులకు వినతులు అందజేయాలని స్కీమ్‌ వర్కర్లందరికీ మేము పిలుపునిస్తున్నాము’ అని అన్నారు.

➡️