ఇదంతా పెద్ద కుట్ర- ఆధారాల్లేకుండా అరెస్టు చేశారు

Mar 29,2024 10:30 #Arvind Kejriwal, #speech

బిజెపి స్క్రిప్టు ప్రకారమే మాగుంట నా పేరు ఇరికించారు
ఆరు వాంగ్మూలాల్లో ఎక్కడా నాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా లేదు
అప్రూవర్‌గా మారాకనే ప్రస్తావన
ఆ వెంటనే రాఘవకు బెయిలు
తండ్రీ కొడుకులిద్దరూ ఇప్పుడు బిజెపి కూటమిలోని తెలుగుదేశంలో చేరారు
ఢిల్లీ కోర్టులో అరవింద కేజ్రీవాల్‌ ప్రకటన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :నన్ను , నా పార్టీని నాశనం చేయడమే లక్ష్యంగా బిజెపి కుట్ర పన్నిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా విమర్శించారు. బిజెపి రచించిన స్క్రిప్టు ప్రకారమే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) యాక్ట్‌ చేస్తోందన్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లిక్కర్‌ వ్యాపారి మాగుంట కుటుంబం చేత ఇడి ఎలా తప్పుడు వాంగ్మూలం ఇప్పించిందీ ఆయన వివరించారు. గురువారం నాడు ఇడి ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్‌ స్వయంగా తన వాదనను వినిపించేందుకు అనుమతి కోరగా, న్యాయమూర్తి అందుకు అనుమతించారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ హిందీలో తన వాదనను వినిపిస్తూ మద్యం పాలసీ వ్యవహారంలో ఎప్పుడైతే ఇడి జోక్యం చేసుకుందో అప్పుడే అసలైన స్కాము మొదలైందన్నారు. ఇడి ప్రస్తుతం రెండు లక్ష్యాలు పెట్టుకొందని, అందులో ఒకటి ఆప్‌ పార్టీని నాశనం చేయడం, మరొకటి డబ్బుల దందాను సాగించడం అని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా తనను ఇరికించడమే ఇడి ఏకైక లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇడి కస్టడీని తాను వ్యతిరేకించడం లేదు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కస్టడీ లోకి తీసుకోమనండి. రెండేళ్ల క్రితం నుంచి ఈ కేసు నడుస్తోంది. 2022 ఆగస్టులో సిబిఐ కేసు నమోదైంది. అప్పుడు ఇసిఐఆర్‌ ఫైల్‌ చేశారు. దాదాపు 25,000 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా లిక్కర్‌ వ్యాపారి, రాజకీయ నాయకుడు మాగుంట శ్రీనివాసులు, రాఘవ గురించి కేజ్రీవాల్‌ ప్రస్తావించారు. వారు గత నెలలోనే బిజెపి మిత్రపక్షమైన టిడిపిలో చేరి ఆ కూటమి తరపున బిజీగా ప్రచారం చేస్తున్నారు. వీరిలో ఒకరు అప్రూవర్‌గా మారిన తరువాత ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని తనను ఈ కేసులో ఇరికించారని కేజ్రీవాల్‌ అన్నారు. మాగుంట రాఘవను అరెస్టు చేయడంతో శ్రీనివాసులు రెడ్డి ఒక్కసారిగా బాణీ మార్చారని అన్నారు. శ్రీనివాసులు రెడ్డి ఇడికి ఏడు సార్లు వాంగ్మూలాలిచ్చారని వాటిలో ఆరింటిలో తనకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా లేదని, అప్రూవర్‌గా మారిన తరువాత ఇచ్చిన ఒకే ఒక వాంగ్మూలంలో తన గురించి ప్రస్తావించారని, ఆ వెనువెంటనే రాఘవకు బెయిలు లభించిందని కేజ్రీవాల్‌ కోర్టుకు వివరించారు. మాగుంట సౌత్‌ గ్రూపునకు చెందిన నెల్లూరు, చెన్నై, ఢిల్లీ కార్యాలయాలపై దాడులు చేసిన ఇడి వారిని నిందితులుగా పేర్కొనకపోవడం, అప్రూవర్‌గా మారిన తరువాత క్షమాభిక్ష ఇవ్వడం, సిబిఐ దాఖలు చేసిన ఒక కేసులో మందుస్తు బెయిలు మంజూరు చేశారని అన్నారు. మాగుంట శ్రీనివాసులు ఇచ్చిన చివరి స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఇడి తనను అరెస్టు చేసిందన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేసేందుకు ఈ వాంగ్మూలాలు సరిపోతాయా అని ఆయన ప్రశ్నించారు. అవినీతి జరిగిందంటున్నారు. ఆ అవినీతి డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఇడి చెప్పాలన్నారు. ఈ వ్యాఖ్యలపై జోక్యం చేసుకొన్న న్యాయమూర్తి… ఈ అంశాలను లిఖితపూర్వకంగా ఇవ్వగలరా? రికార్డులోకి తీసుకుంటామని అన్నారు.
ఏం లేదు..ఏం లేదు : మాగుంట
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం నాడు కోర్టులో తనపై చేసిన ఆరోపణలపై స్పందించాలని ప్రజాశక్తి కోరగా, ఏం లేదు..ఏం లేదు అని మాగుంట శ్రీనివాసులు దాటేశారు. శ్రీనివాసులు రెడ్డి 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసిపి తరపున 2019లో ఎంపిగా పోటీ చేసి గెలుపొందారు. అయిదు సంవత్సరాల పాటు ఆ పార్టీ ఎంపిగా ఉండి గత నెలలో టిడిపిలోకి ఫిరాయించారు.
శరత్‌ చంద్రారెడ్డి బిజెపికి రూ.55 కోట్లు విరాళం
ఇడి ఫైల్‌లో ఉన్న లక్ష పేజీలు తమకు అనుకూలంగా ఉన్నా రికార్డుల్లోకి తీసుకురాలేదని కేజ్రీవాల్‌ కోర్టుకు నివేదించారు. ఇడి ఆరోపిస్తున్నట్లు ఎక్కడా రూ.100 కోట్లు వాస్తవంగా లేవన్నారు. ఇడి విచారణ తరువాత అసలు మద్యం కుంభకోణం ప్రారంభమైందని అన్నారు. మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న శరత్‌ చంద్రారెడ్డి బిజెపికి రూ.55 కోట్లు విరాళం ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఈ దందా సాగుతున్నట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. మనీ ట్రయల్‌ జరిగిందన్నారు. అరెస్ట్‌ తర్వాతే శరత్‌చంద్రారెడ్డి బిజెపికి రూ.50 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు.
కేజ్రీవాల్‌ ఆరోపణలను ప్రభుత్వ తరపు న్యాయవాది అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వి రాజు ఖండించారు. గోవా ఎన్నికల్లో వినియోగించిన లంచం మొత్తాలను ఆప్‌ స్వీకరించిందని ఆరోపించారు. ఆ డబ్బు సౌత్‌ గ్రూప్‌ నుంచి హవాలా రూపంలో వచ్చాయని చెప్పడానికి ఇడి దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. లిక్కర్‌ స్కాంకు బిజెపికి వచ్చిన డబ్బులకు సంబంధం లేదన్నారు. మద్యం విధానాన్ని రూపొందించే హక్కు ఢిల్లీ ప్రభుత్వానికి తప్ప మరెవరికీ లేదన్నారు. సిఎం అయినంత మాత్రాన అరెస్ట్‌ చెయ్యకూడదని లేదని కోర్టుకు వివరించారు. సిఎంకు భిన్నమైన ప్రమాణాలు లేవని, సామాన్యుల లాగానే సిఎంను అరెస్ట్‌ చేసే అధికారం ఉందన్నారు.
ఈ వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది రమేశ్‌ గుప్తా స్పందిస్తూ.. ఎలక్టోరల్‌ బాండ్స్‌తో ఈ కేసుతో సంబంధం లేకపోతే, దీనిపై కూడా విచారణ జరిపేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు రిజర్వ్‌ చేశారు. సాయంత్రం 4 గంటల తరువాత ఇచ్చిన ఉత్తర్వుల్లో కేజ్రీవాల్‌కు ఏప్రిల్‌ ఒకటి వరకు ఇడి కస్టడీకి ఇస్తున్నట్లు వెల్లడించారు.

➡️