కేజ్రీవాల్‌ అరెస్టు – సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్ర ఖండన

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఇడి అరెస్టు చేయడాన్ని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనను అది విడుదల చేసింది. మోడీ ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వ అవినీతి బహిర్గతం కావడం, ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు వంటి వాటితో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండడం బిజెపిని బెంబేలెత్తిస్తోంది. దీంతో ప్రతిపక్ష నాయకులపై ప్రతీకారేచ్ఛతో దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నదని పొలిట్‌బ్యూరో విమర్శించింది. అరెస్టయిన ఇండియా వేదికకు చెందిన రెండో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అని పొలిట్‌బ్యూరో గుర్తు చేసింది. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం బిజెపిని ఓడించడానికి కట్టుబడి ఉన్న ప్రతిపక్ష నాయకుల్ని దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటాయని, బిజెపిలో ఫిరాయించిన వారికి రక్షణ, కానుకలు లభిస్తున్నాయని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ జరిగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని తన శాఖలకు పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది.

➡️