17న హాజరవ్వండి – కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఫిర్యాదుపై ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మెట్రోపాలిటన్‌ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో తాము పంపిన సమన్లకు కేజ్రీవాల్‌ స్పందించడం లేదని ఇడి కోర్టును ఆశ్రయించడంతో కోర్టు జోక్యం చేసుకోవాల్సివచ్చింది. ఇడి ఫిర్యాదును స్వీకరించి విచారణను ప్రారంభించామని, ఈ నెల 17న కోర్టు ఎదుట హాజరుకావాలని సమన్లు జారీ చేసినట్లు అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ దివ్య మల్హోత్ర తెలిపారు. ఈ కేసులో తమ వాదనలు ముగిసాయని ఇడి తెలపడంతో తీర్పును మేజిస్ట్రేట్‌ రిజర్వ్‌ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ కేజ్రీవాల్‌కు ఇడి ఐదు సార్లు సమన్లు జారీ చేసింది. ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఇడి ఈ నెల 3న ఇడి కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలపై ఆప్‌ నాయకులు జాస్మిన్‌ షా స్పందిస్తూ ‘కోర్టు ఆదేశాలను అధ్యయనం చేస్తున్నాం. తరువాత తదనుగుణంగా అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

➡️