నమాజ్‌ చేస్తుంటే.. నలుగురు విదేశీ విద్యార్థులపై దాడి

  • ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
  • ‘జై శ్రీరామ్‌’ నినాదాలు చేస్తూ దుండగుల దుశ్చర్య
  • గుజరాత్‌ యూనివర్సిటీ హాస్టల్‌లో ఘటన

గాంధీనగర్‌ : అహ్మదాబాద్‌లోని గుజరాత్‌ యూనివర్సిటీ అంతర్జాతీయ బాలుర హాస్టల్‌లో రంజాన్‌ సందర్భంగా నమాజ్‌ చేస్తున్నందుకు శనివారం అర్థరాత్రి ఒక గుంపు దాడి చేయటంతో నలుగురు విదేశీ విద్యార్థులు గాయపడ్డారు. దీనిని హిందూత్వ శక్తుల దాడిగా కొందరు విద్యార్థులు, సాక్షులు చెప్తున్నారు. ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారనీ, వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నదని చెప్పారు. ఘటన గురించి తెలుసుకున్న అహ్మదాబాద్‌ పోలీస్‌ చీఫ్‌ జిఎస్‌ మల్లిక్‌.. గుజరాత్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ నీర్జా గుప్తా ఆదివారం ఉదయం హాస్టల్‌కు చేరుకున్నారు. అనంతరం వైస్‌ ఛాన్సలర్‌ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన ఇరు గ్రూపుల మధ్య గతంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నట్టు తెలుస్తున్నదని చెప్పారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు చెందిన విద్యార్థులు గుజరాత్‌ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ బాలుర హాస్టల్‌ బ్లాక్‌-ఎలో నిర్ణీత ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి తరావీ నమాజ్‌ చేస్తున్నారు. ఆ సమయంలో వారిపై దాడి జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కొంతమంది వ్యక్తులు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేస్తున్నట్టు కూడా వీడియోల్లో కనిపించింది.
పోలీసు కమిషనర్‌ మాలిక్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో విదేశీ విద్యార్థులు నమాజ్‌ చేస్తున్నప్పుడు 20-25 మంది అక్కడ ఎందుకు ప్రార్థనలు చేస్తున్నారంటూ బెదిరించారు. ఆ తరువాత వారిపై దాడికి దిగారని వివరించారు. ”రాత్రి 10.51 గంటలకు పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందింది. రాత్రి 10.56 గంటలకు పిసిఆర్‌ వ్యాన్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నది” అని మాలిక్‌ చెప్పారు. సంఘటనను తీవ్రంగా పరిగణించామని, కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశామని, ఒక నిందితుడిని గుర్తించామని చెప్పారు.
జమాల్‌పూర్‌ ఖాడియాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇమ్రాన్‌ ఖేదావాలా మాట్లాడుతూ.. ”రాత్రి 10.30 గంటలకు నమాజ్‌ సమయంలో ‘జై శ్రీరాం’ నినాదాలు చేస్తూ దాదాపు 30 మంది దుండగులు ఆ ప్రాంతంలోకి ప్రవేశించి విద్యార్థులపై దాడి చేశారని తెలిపారు. గాయపడిన నలుగురు విద్యార్థులలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. హాస్టల్‌ సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని ఖేదావాలా తెలిపారు.

➡️