బెంగాల్‌లో రాహుల్‌ కారుపై రాళ్ల దాడి 

Feb 1,2024 08:22 #West Bengal
attack on rahul car in west bengal

ఇది తృణమూల్‌ పనే : మండిపడిన కాంగ్రెస్‌

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రయాణిస్తున్న కారుపై బుధవారం రాళ్ల దాడి జరిగింది. భారత్‌ జోడో న్యారు యాత్రలో భాగంగా మల్డా జిల్లాలోని హరిశ్చంద్రపూర్‌ ప్రాంతంలో రాహుల్‌ పర్యటిస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కారు వెనుక అద్దం పగిలిపోయిందని, అయితే రాహుల్‌కు ఎలాంటి గాయాలు కాలేదని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌదరి తెలిపారు. దాడి జరిగిన కొద్ది సేపటి తర్వాత రాహుల్‌ కారు నుండి కిందికి దిగి జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఇలాంటి దాడులు ఆమోదయోగ్యం కావని అధిర్‌ అన్నారు. ఈ విధమైన చర్యలకు రాహుల్‌ భయపడబోరని చెప్పారు. రాళ్ల దాడికి తృణమూల్‌ కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. ‘కారు వెనుక నుండి రాళ్లు రువ్వి ఉండవచ్చు. ఇంత జరుగుతున్నా భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. ఇది స్వల్ప సంఘటనే. అయినప్పటికీ రాహుల్‌కు ఏమైనా జరిగితే పరిస్థితి ఏమిటి? ఆయనకు తగినంత భద్రత కల్పించలేదు. ఈ దాడి ఎవరు చేయించారో మీకు అర్థమైందా? కాంగ్రెస్‌ ఎవరినీ అణగదొక్కదు. ఆయన్ని అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారు’ అని అధీర్‌ విమర్శించారు. అయితే రాహుల్‌ వాహనంపై దాడి జరిగింది బెంగాల్‌లో కాదని, బీహార్‌లోని కతిహార్‌లో అని రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వివరణ ఇచ్చారు. బీహార్‌లో యాత్ర ముగించుకున్న రాహుల్‌ బెంగాల్‌లో తిరిగి ప్రవేశించారు. అంతకుముందు ఆయన బీహార్‌లోని కతిహార్‌ జిల్లాలో రోడ్‌షో నిర్వహించారు.

➡️