Bhima Koregaon case : జైలు నుండి విడుదలైన సోమాసేన్‌

న్యూఢిల్లీ : భీమా కొరెగావ్‌ కేసులో అక్రమంగా అరెస్టయిన నాగపూర్‌ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్‌ సోమాసేన్‌ బుధవారం జైలు నుండి విడుదలయ్యారు. సోమాసేన్‌ కుటుంబసభ్యులను కలుసుకున్న ఫోటోలను ఆమె తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ”ఎట్టకేలకు జైలు నుండి విడుదలయ్యారు. బైకుల్లా జైలు బయట ఆమె తన కుమార్తెను కలుసుకున్నారు” అని ట్వీటర్‌లో పేర్కొన్నారు. బెయిల్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత సేన్‌ జైలు నుండి విడుదలయ్యారని సీనియర్‌ జైలు అధికారి ఒకరు తెలిపారు. భీమా కొరెగావ్‌ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు సోమాసేన్‌కు బెయిల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమెపై వచ్చిన ఉగ్రవాద ఆరోపణలు ప్రాథమికంగా అవాస్తవమని ఏప్రిల్‌ 15న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2018, జూన్‌ 6న సోమాసేన్‌ సహా పలువురు మానవ హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలు, న్యాయవాదులను చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యుఎపిఎ) కింద పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుండి ఆమె బైకుల్లా జైలులోనే ఉన్నారు.

➡️