Electoral Bonds దేశంలోనే అతిపెద్ద కుంభకోణం : సంజయ్ రౌత్‌

ముంబై : ఎలక్టోరల్‌ బాండ్ల వల్ల బిజెపి కోట్లాది రూపాయల్ని వెనుకేసుకుందని, ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని శివసేన (యుబిటి) నేత సంజరు రౌత్‌ తీవ్రంగా విమర్శించారు. ఎలక్టోరల్‌ బాండ్ల విషయంపై సంజరురౌత్‌ శుక్రవారం మాట్లాడుతూ.. ‘గేమింగ్‌ అండ్‌ గ్యాంబ్లింగ్‌ కంపెనీలు ఎలక్టోరల్‌ బాండ్‌లను కొనుగోలు చేస్తాయి. ఆ నిధులను నేరుగా బిజెపి ఖాతాల్లోకి పంపిస్తాయి. మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ అనేక కాంట్రాక్టులను పొందిన ఫలితంగా లక్షల ఎలక్టోరల్‌ బాండ్‌లను కొనుగోలు చేసింది. ఈ నిధులను నేరుగా బిజెపి బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తోంది. ఎలక్టోరల్‌ బాండ్లలో డబ్బును కొనుగోలు చేసి రాజీకయ పార్టీలకు బదిలీ చేసిన ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం’ అని సంజరురౌత్‌ బిజెపిపై తీవ్రంగా ఆరోపించారు.
కాగా, ఎలక్టోరల్‌ బాండ్లపై ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ ఝా కూడా బిజెపిని తీవ్రంగా విమర్శించారు. కంపెనీలపై ఇటీవల జరిగిన ఈడీ దాడులకు, ఆ తర్వాత బాండ్ల కొనుగోలుకు మధ్య సంబంధం ఉందని మనోజ్‌ విమర్శించారు. ‘మొదట ఇడి దాడి చేస్తుంది. కొన్ని గంటల తర్వాత ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేస్తారు. ఈడీ దాడులకు, ఎలక్టోరల్‌ బాండ్లకు మధ్య ఉన్న లింక్‌ని గమనించాలి. ఇది ప్రజలకు ఈరోజు ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. అయితే దీని గురించి అందరికీ ముందే తెలుసు.’ అని మనోజ్‌ ఝా అన్నారు.
రాజ్యసభ ఎంపి కపిల్‌ సిబాల్‌ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం, ఇడి, సిబిఐ దర్యాప్తు సంస్థలు నిద్రపోతున్నాయి. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఇదే జరిగితే చర్యలు తీసుకునేవారు. కానీ వారు (ఇడి, సిబిఐ అధికారులు) ప్రస్తుతం నిద్రమాత్రలు ఎక్కువమోతాదులో వేసుకుని నిద్రపోతున్నారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. గతంలో మోడీ ‘స్విస్‌ బ్యాంకు నుంచి నల్లధనం తీసుకొచ్చి దేశ ప్రజల ఒక్కొక్కరి ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ డబ్బును ప్రజల ఖాతాల్లోకి కాకుండా.. వారి ఖాతాల్లోకి మార్చుకున్నారని దీన్నిబట్టి తెలుస్తోంది.’ అని కపిల్‌ సిబాల్‌ అన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన ‘ఈ ఎలక్టోరల్‌ బాండ్లపై ఏ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయవు అని నా అభిప్రాయం. ఇప్పుడు వారేం చేస్తారు? వారు ఏ చర్య తీసుకుంటారో నిర్ణయించే బాధ్యత కోర్టుపై ఉంది.’ అని సిబాల్‌ అన్నారు.

➡️