బిల్కిస్‌ బానో కేసు నిందితుల పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

Jan 19,2024 14:32 #Bilkis Bano Case, #Supreme Court

న్యూఢిల్లీ :    బిల్కిస్‌ బానో కేసులో నిందితుల పిటిషన్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌లకు  విచారణ  అర్హత లేదని జస్టిస్‌ బివి.నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.     గడువును పొడిగించేందుకు నిరాకరిస్తూ, ఆదివారంలోగా  నిందితులు జైలులో లొంగిపోవాలని ఆదేశించింది.  మీ వ్యవహారాలను  చక్కదిద్దుకునేందుకు మీకు  ఇప్పటికే రెండు వారాల సమయం ఇచ్చామని,   ఇకపై గడువును పొడిగించలేమని ధర్మాసనం పేర్కొంది.  బిల్కిస్‌ బానో కేసులో 11 మంది నిందితుల్లో ఒకరైన గోవింద్‌ బాయ్  నాయ్  సహా మరో ఇద్దరు జైలులో  లొంగిపోయేందుకు మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే. కుటుంబ బాధ్యతల రిత్యా తమకు మరికొంత సమయం ఇవ్వాలని పిటిషన్లలో పేర్కొన్నారు.

2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారాని పాల్పడటంతో పాటు ఆమె మూడేళ్ల కుమార్తె సహా ఏడుగురు కుటుంబసభ్యులను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ 11 మంది నిందితులను గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌పై విడుదల చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ జనవరి 22లోగా నిందితులు జైలులో లంగిపోవాలని ఈ నెల 8న ఆదేశించింది

➡️