గుజరాత్‌లో మద్యానికి తలుపులు తెరిచిన బిజెపి

Jan 24,2024 10:18 #alcohol, #BJP, #Gujarat, #opened
  • గిఫ్ట్‌ సిటీలో అనుమతించిన ప్రభుత్వం

గాంధీనగర్‌ : మద్యపానం ఆరోగ్యానికి హానికరం..మద్యాన్ని సంపూర్ణంగా నిషేదించాలని నినదించి మద్య రహిత సమాజాన్ని ఆకాంక్షించిన మహాత్మాగాంధీ నడిచిన నేలపై బిజెపి ప్రభుత్వం మద్యపానానికి మళ్లీ తలుపులు తెరిచింది. గుజరాత్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్య నిషేధానికి పాక్షికంగా మంగళం పాడింది. రాజధాని గాంధీనగర్‌ సమీపంలోని గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌-సిటీ (గిఫ్ట్‌ సిటీ)లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో మద్యాన్ని విక్రయించేందుకు అనుమతులు జారీ చేసింది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. గిఫ్ట్‌ సిటీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, యజమానులకు మాత్రమే మద్యాన్ని సేవించే అవకాశం ఉంటుందని పేర్కొంది. వీరిని నిషేధపు చట్టం నుండి మినహాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గుజరాత్‌ మద్య నిషేద చట్టం ప్రకారం రాష్ట్రంలో మద్యం వినియోగం చట్టవిరుద్ధం. సంపూర్ణంగా మద్య నిషేదం అమల్జేయాల్సివుంది. వాస్తవానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి గుజరాత్‌లో మద్య నిషేధం అమలులో ఉంది. రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, వినియోగం కూడా నేరమే. జాతిపిత మహాత్మాగాంధీ జన్మస్థలమైన గుజరాత్‌ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

➡️