కేరళలో అమలు చేయం : విజయన్‌

Urban Commission soon for development of cities in Kerala, says Chief Minister Pinarayi Vijayan
  • సిఎఎపై ప్రతిపక్షాల ఆగ్రహం

న్యూఢిల్లీ : సిఎఎను అమల్లోకి తెచ్చినట్లు కేంద్రంలోని బిజెపి ప్రకటించడంపై వివిధ రాజకీయపార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  సిఎఎను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినా కేరళలో మాత్రం ఆ చట్టాన్ని అమలు చేయబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పష్టం చేశారు. మతపరమైన మార్గాల్లో ప్రజల్లో విభజన సృష్టించే చట్టంగా సిఎఎను విజయన్‌ విమర్శించారు. దేశంలో కల్లోలం రేపే లక్ష్యంతోనే బిజెపి దీనిని అమలు చేస్తున్నట్లు ప్రకటించిందని అన్నారు. ప్రజలను విభజించే, మతభావాలను రెచ్చగొట్టే, రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను దెబ్బతీసే ఈ చట్టాన్ని అంతా ఐక్యంగా వ్యతిరేకించాలని విజయన్‌ పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాలో భాగంగానే దీన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు విజయన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ముస్లిం మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే సిఎఎను కేరళలో అమలు చేయబోమని మా ప్రభుత్వం పదేపదే తెలిపింది. దానికే కట్టుబడి ఉంది. ప్రజల మధ్య మత విభజన తెచ్చే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ అంతా ఏకతాటిపై నిలబడాలి’ అని ప్రకటనలో విజయన్‌ తెలిపారు. సిఎఎ 2019ను అమల్లోకి తెచ్చినట్లు కేంద్రం ప్రకటించిన గంటల వ్యవధిలోనే విజయన్‌ ఈ ప్రకటన విడుదల చేశారు.

ఇది విభజన రాజకీయం : కాంగ్రెస్‌
లోక్‌సభ ఎన్నికలకు ముందు సిఎఎ అమలు చేస్తున్నట్లు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రకటించాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుపట్టింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌, అస్సాంల్లో ఎన్నికల్లో ప్రయోజనాల కోసం బిజెపి తన సంకుచిత రాజకీయాలతోనే దీన్ని ప్రకటించిందని విమర్శించింది. కాంగ్రెస్‌ నాయకులు జైరాం రమేష్‌ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఎన్నికల బ్యాండ్ల విషయంలో ఎస్‌బిఐ పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయాన్ని మీడియాలో హెడ్‌లైన్ల నుంచి తప్పించడానికి, కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించిందని కూడా ఆరోపించారు. 2019 డిసెంబరులో పార్లమెంట్‌ ఆమోదించిన చట్టానికి సంబంధించిన నిబంధనలను నోటిఫై చేయడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి నాలుగేళ్ల మూడు నెలల సమయం పట్టిందని విమర్శించారు. కేవలం ఎన్నికలకు ముందు సంకుచిత రాజకీయాల కోసమే ఈ నోటిఫికేషన్‌ను కేంద్రం తీసుకొచ్చిందని ఆరోపించారు.

ప్రజల దృష్టి మళ్లించడానికే : అఖిలేష్‌ యాదవ్‌
వివిధ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే సిఎఎ అమలు చేస్తున్నట్లు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రకటించిందని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎస్‌పి నాయకులు అఖిలేష్‌ యాదవ్‌ విమర్శించారు. బిజెపి రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. ఈ మేరకు అఖిలేష్‌ యాదవ్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘ప్రస్తుతం దేశంలోని అనేక మంది పౌరులు బ్రతుకు తెరువు కోసం బలవంతంగా ఇతర దేశాలకు వెళ్తున్న సమయంలో.. విదేశీయుల కోసం సిఎఎను తీసుకురావడం వల్ల ఏమి జరుగుతుంది? బిజెపి రాజకీయాల ను ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు’ అని అఖిలేష్‌ యాదవ్‌ పోస్ట్‌ చేశారు. ‘తమ పదేళ్ల పాలనలో లక్షలాది మంది పౌరులు దేశ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో బిజెపి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. అలాగే లోక్‌సభ ఎన్నికలు తరువాత ‘ఎన్నికల బాండ్లు, పిఎం కేర్‌ ఫండ్‌’ గురించి కూడా వివరణ ఇవ్వాలి’ అని అఖిలేష్‌ యాదవ్‌ జోడించారు.

వివక్ష చూపితే వ్యతిరేకిస్తాం : మమత బెనర్జీ

ప్రజల హక్కులను కాలరాచే విధంగా వుంటే సిఎఎను, తాము వ్యతిరేకిస్తామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. సిఎఎ దేశంలో నివసించే ప్రజల సమూహాలపై వివక్ష చూపేదిగా వున్నా లేదా వారి ప్రసుత్త పౌరసత్వ హక్కులను హరించేదిగా వున్నా ఈ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయమని మమతా చెప్పారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే : స్టాలిన్‌


బిజెపి తన రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన మనోభావాలను ఉపయోగించుకోవడానికే సిఎఎను అమలు చేస్తున్నట్లు ప్రకటించిందని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షులు ఎంకె స్టాలిన్‌ విమర్శించారు. అలాగే ‘మునిగిపోతున్న బిజెపి అనే నౌకను రక్షించుకోవడానికి మోడీ చేస్తున్న ప్రయత్నం’ అని కూడా స్టాలిన్‌ విమర్శించారు. ముస్లింలకు, శ్రీలంకకు చెందిన తమిళలకు ద్రోహం చేయడం ద్వారా మోడీ ప్రజల మధ్య విభజనకు బీజం వేశారని స్టాలిన్‌ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి చేస్తున్న ఈ రాజకీయాలకు ప్రజలు సరైన బుద్ధి చెబుతారని కూడా స్టాలిన్‌ తెలిపారు. కాగా, సిఎఎను తమిళనాడులో అమలు చేయమని జనవరిలోనే స్టాలిన్‌ ప్రకటించారు.

➡️