చైల్డ్‌ పోర్న్‌ కేసు – మద్రాసు హైకోర్టు తీర్పుపై విచారణకు సుప్రీం అంగీకారం

న్యూఢిల్లీ : బాలల అశ్లీల చిత్రాలను కేవలం డౌన్‌లోడ్‌ చేసుకోవడం, వీక్షించడం పోక్సో చట్టం కింద, సమాచార సాంకేతిక చట్టం కింద నేరం కాదంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను సవాలు చేస్తున్న పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు సోమవారం అంగీకరించింది. ఈ రూలింగ్‌ను దారుణమైనదిగా వ్యాఖ్యానించింది. బాలల అశ్లీల చిత్రాలను తన మొబైల్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్నాడని అభియోగాలు నమోదైన 28ఏళ్ల వ్యక్తిపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను మద్రాసు హైకోర్టు జనవరి 11న కొట్టివేసింది. అసభ్య చిత్రాలనే తీవ్రమైన సమస్యతో ప్రస్తుత రోజుల్లో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారిని శిక్షించడానికి బదులుగా ఈ విషయంలో చైతన్యవంతులను చేసే దిశగా సమాజం పరిపక్వత పొందాలని హైకోర్టు ఆనాడు వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు చట్టాలకు పూర్తి విరుద్ధంగా వుందంటూ రెండు సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. వాటి తరపున సీనియర్‌ న్యాయవాది హెచ్‌.ఎస్‌.ఫూల్కా చేసిన వాదనలను ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌, జస్టిస్‌ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన సుప్రీం బెంచ్‌ పరిగణనలోకి తీసుకుంది. ”హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా దారుణంగా వుంది. ఏకసభ్య ధర్మాసనం ఇలా ఎలా చెబుతుంది? మూడు వారాల్లోగా జవాబివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేయండి” అని చంద్రచూడ్‌ పేర్కొన్నారు.
బాలల సంక్షేమం కోసం పనిచేసే ఎన్‌జిఓలు ఫరీదాబాద్‌కి చెందిన జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అలయన్స్‌్‌, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌లు ఈ పిటిషన్లు వేశాయి. చెన్నై నివాసి అయిన ఎస్‌.హరీష్‌, తమిళనాడుకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు సమాధానాలు ఇవ్వాలని సుప్రీం కోరింది. హరీష్‌పై పోక్సో చట్టం, సమాచారం సాంకేతిక చట్టం కింద దాఖలైన క్రిమినల్‌ కేసులను హైకోర్టు కొట్టివేసింది.

➡️