Congress : మహిళా సంక్షేమ పథకాల అమలులో మోడీ ప్రభుత్వం విఫలం

న్యూఢిల్లీ :    మహిళా సంక్షేమ పథకాల అమల్లో మోడీ ప్రభుత్వం గత పదేళ్లలో ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్‌ మండిపడింది. బడ్జెట్‌లోనూ మోడీ ప్రభుత్వం మహిళల సంక్షేమ పథకాల కేటాయింపులను తగ్గించిందని, ఐదు కీలక సమస్యల పరిష్కారంలో వైఫల్యం మూటగట్టుకుందని ధ్వజమెత్తింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ మంగళవారం గత 10 ఏళ్ల మోడీ ప్రభుత్వ హయాంలో మహిళా సంక్షేమ పథకాల అమలు తీరుని ప్రశ్నించారు.  2023-24 కేంద్ర బడ్జెట్‌లో అంగన్‌వాడీలు, పోషకాహార పథకాలు, మహిళల భద్రత, శిశు సంరక్షణ సంస్థలకు కేవలం 0.55 శాతం మాత్రమే కేటాయించారని జైరాం రమేష్‌ పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్‌లో ఎండబ్ల్యుసిడి వాటా 0.75 శాతం కంటే తక్కువగా ఉందని స్పష్టం చేశారు.

హిమాచల్ ప్రదేశ్ బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న  బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై  కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సుప్రియా శ్రీనతే అభ్యంతరకరమైన పోస్ట్ చేశారంటూ జాతీయ మహిళా కమిషన్ విస్మయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్   ఈ విధంగా స్పందించారు.

‘నారీశక్తి’ (మహిళా సాధికారత) అంటూ బిజెపి నినాదాలే తప్ప వారి సంక్షేమ కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. 10ఏళ్లుగా మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అసమర్థత, ఉదాసీనత మహిళా వ్యతిరేక మనస్తత్వానికి అద్దం పడుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు జరిగినప్పుడు ఆ శాఖ మౌనంగా ఉంటుందని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో నేరాలకు మాత్రమే ఆయన మేల్కొంటారని  ఎద్దేవా చేశారు. కష్టపడి పనిచేసే మహిళలకు  మంత్రిత్వ శాఖ నిధులను దూరం చేస్తోందని మండిపడ్డారు.

మోడీ ప్రభుత్వం ఐదు అంశాల్లో వైఫల్యాన్ని మూటగట్టుకుందని ధ్వజమెత్తారు. మహిళలు, చిన్నారులపై దాడులు రెట్టింపయ్యాయని, బడ్జెట్‌లో కోతలు, నిధుల తగ్గింపు, తక్కువ వేతనం, అంగన్‌వాడీ కార్యకర్తల పట్ల అసహ్యంగా ప్రవర్తించడం, మహిళలు, చిన్నారుల్లో పెరుగుతున్న రక్తహీనత, నిరుద్యోగం మరియు ఆదాయంలో కోతలు వంటి ఐదు అంశాల పట్ల మోడీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని అన్నారు.

పదేళ్లలో మహిళలపై నేరాలు రెట్టింపు అయ్యాయని, 2012లో 2.4 లక్షల నేరాలు జరగగా, 2022 నాటికి 4.5 లక్షలకు పెరిగిందని అన్నారు. మహిళలపై నేరాలను పరిష్కరించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ‘నిర్భయ’ నిధులను 2022 నాటికి కేవలం 35 శాతం మాత్రమే ఉపయోగించారని అన్నారు.

రెజ్లర్లపై బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ లైంగిక వేధింపుల ఫిర్యాదులపై మోడీ ప్రభుత్వం స్పందించలేదని, బిల్కిస్‌ బానో కేసులో నిందితులను నిర్దోషులుగా విడుదల చేశారని, అలాగే మణిపూర్‌లో లైంగిక దాడుల కేసుల్లోనూ ప్రభుత్వం మౌనంగానే ఉందని అన్నారు. మణిపూర్‌ నుండి ప్రతి రోజూ అత్యాచారం, దాడికి సంబంధించిన కొత్త కేసులు వస్తుంటే, ప్రధాని మరియు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉదాసీనంగా వ్యవరించిందని అన్నారు. మహిళలపై దాడికి పాల్పడిన భయానక వీడియోలు బయటికి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఆ ఘటనలపై మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రకటన కూడా చేయలేదని .. అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు.

➡️