మణిపూర్‌ హింసపై సిపిఎం అఫిడవిట్‌

  • విచారణ కమిషన్‌కు అందచేత

న్యూఢిల్లీ : మణిపూర్‌లో మైతీ – కుకీ ఘర్షణలను కట్టడి చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం, ఇంటెలిజెన్స్‌ విభాగం వైఫల్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, సిపిఎం మణిపూర్‌ రాష్ట్ర కమిటీ మణిపూర్‌ హింసపై విచారణా కమిషన్‌కు ఒక అఫిడవిట్‌ను అందజేసింది. ఇండో – మయన్మార్‌ సరిహద్దుకు ప్రభుత్వం కంచె వేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది. ఇంఫాల్‌ వెస్ట్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ ద్వారా సిపిఎం మణిపూర్‌ కార్యదర్శి క్షేత్రిమయుమ్‌ శాంటా 37పేజీల ఈ అఫిడవిట్‌ను అందజేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి విచారణా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం మణిపూర్‌ ప్రెస్‌ క్లబ్‌లో మీడియానుద్దేశించి క్షేత్రిమయుమ్‌ శాంటా మాట్లాడారు. మణిపూర్‌ హింసకు సంబంధించిన సంఘటనల సమాహారం, ఘర్షణకు గల కారణాలు, ఈ హింసకు బాధ్యులుగా ఎవరిని నిర్ధారించాలనే విషయాలను అఫిడవిట్‌లో పంచుకున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలను అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిన కారణంగా ప్రజలు పడిన ఇబ్బందులను సిపిఎం ప్రముఖంగా ప్రస్తావించినట్లు శాంటా పేర్కొన్నారు. హింసను నియంత్రించడంలో ప్రభుత్వ యంత్రాంగం, ఇంటెలిజెన్స్‌ విఫలమయ్యాయన్న విషయాన్ని ముఖ్యమంత్రే స్వయంగా అంగీకరించారని శాంటా గుర్తు చేశారు. మణిపూర్‌ హింసపై వచ్చిన అనేక వార్తా కథనాలను కూడా అఫిడవిట్‌తో పాటూ అందజేసినట్లు తెలిపారు. వేలాదిమంది ప్రజలు నిర్వాసితులు కావడం, గ్రామాలపై దాడులు, 200మందికి పైగా మరణాలు, సున్నితమైన ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇలా అన్నింటికీ సంబంధించిన వార్తలను అందజేసినట్లు తెలిపారు. లైలాంగ్‌ విషాదం నేపథ్యంలో మణిపూర్‌ లోయలో ఎఎఫ్‌ఎస్‌పిఎని తిరిగి విధించాలంటూ సిఎం ఎన్‌.బీరేన్‌ సింగ్‌ మాట్లాడడం చూస్తుంటే అది బెదిరింపుగా వుందని, ఖండించదగ్గ అంశమని శాంటా పేర్కొన్నారు. ప్రభుత్వం గనుక ముందస్తు చర్యలు తీసుకుని వుంటే అసలు మణిపూర్‌లో హింస చోటు చేసుకుని వుండేది కాదని అన్నారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

10 ప్రతిపక్ష పార్టీల ఖండన

రాష్ట్రంలో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఎఎఫ్‌ఎస్‌పిఎ) తిరిగి విధించాలంటూ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను పది ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. కాంగ్రెస్‌, ఆప్‌, ఎఐటిసి, ఎఐఎఫ్‌బి, ఎస్‌ఎస్‌(యుబిటి), సిపిఐ, సిపిఐ(ఎం), ఆర్‌ఎస్‌పి, ఎన్‌సిపి, జెడి(యు)లు ఈ మేరకు ఒక ప్రకటన చేశాయి.

➡️