అన్నదాతలపై దాష్టీకం

Feb 9,2024 10:21 #cpm protest, #formers

న్యూఢిల్లీ : డిమాండ్ల సాధన కోసం పార్లమెంట్‌ వైపు ప్రదర్శనగా వెళుతున్న వేలాది మంది అన్నదాతలను ఢిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులో పోలీసులు గురువారం అడ్డుకున్నారు. రాజధానిలోకి ప్రవేశించకుండా వారిని నిలువరించారు. ఆర్‌ఏఎఫ్‌, పోలీస్‌ సిబ్బంది నీటి ఫిరంగులు, బుల్డోజర్లు, క్రేన్లతో సరిహద్దు వద్ద మోహరించి యుద్ధ వాతావరణాన్ని తలపింపజేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రాజధానిలో ప్రవేశించే వారిని తక్షణమే అరెస్ట్‌ చేసి తరలించేందుకు వీలుగా బస్సులను సిద్ధంగా ఉంచారు. పార్లమెంటును ఘెరావ్‌ చేయాలని నోయిడా, గ్రేటర్‌ నోయిడాకు చెందిన 160 గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ, దాద్రీ నుండి తమను తరిమివేయడాన్ని వారంతా వ్యతిరేకించారు. ఎన్టీపీసీ కోసం గతంలో భూములు ఇచ్చిన రైతులందరికీ సమానంగా నష్టపరిహారం చెల్లించాలని, బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, తమ కోసం ఆస్పత్రిని నిర్మించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రేటర్‌ నోయిడాలో ఎనిమిది రోజుల పాటు ధర్నా చేశామని, ఎన్టీపీసీ, నోయిడా అథారిటీ ప్రాంతాలలో రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నామని వారు తెలిపారు. నోయిడా-గ్రేటర్‌ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేను రైతులు దిగ్బంధించినట్లు వార్తలు అందాయి. నోయిడా సెక్టార్‌-24లో ఉన్న ఎన్టీపీసీ కార్యాలయం వద్ద గత సంవత్సరం డిసెంబర్‌ 18న రైతులు సమ్మె చేశారు. అంతకుముందు వారిని ఎన్టీపీసీ ప్రధాన ద్వారానికి కొద్ది దూరంలోనే పోలీసులు నిలిపివేయడంతో రోజంతా నిరసనకు దిగారు. ఎన్టీపీసీ దాద్రీ ప్లాంట్‌ కారణంగా తాము నష్టపోయామని 24 గ్రామాల ప్రజలు ఆరోపించారు. భారతీయ కిసాన్‌ పరిషత్‌ నేత సుఖ్‌బీర్‌ ఖలీఫా నేతృత్వంలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ‘ఎన్టీపీసీ దాద్రీ వద్ద రైతులు అనేక నెలలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక ఉద్యోమాన్ని ప్రారంభించారు. అనేక దఫాలుగా అధికారులతో చర్చలు జరిగాయి. రైతుల డిమాండ్లు సమంజసమైనవేనని వారు అంటున్నప్పటికీ వాటిని నేటి వరకూ నెరవేర్చలేదు. అందుకే ఈసారి నిర్ణయాత్మక పోరుకు సిద్ధమయ్యాం’ అని ఆయన చెప్పారు. కాగా బాధితులకు సమాన నష్టపరిహారం, కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడం సాధ్యంకాదని ఎన్టీపీసీ అంటోంది.

➡️