Priyanka Gandhi : 55 లక్షల కోట్ల నుంచి 205 లక్షల కోట్లకు అప్పును పెంచారు : ప్రియాంకా గాంధీ

న్యూఢిల్లీ: ఎన్‌డిఎ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం గత పదేళ్లలో 150 లక్షల కోట్లను అప్పు చేసింది. ఇప్పుడు మరలా 14 లక్షల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ వద్రా తీవ్రంగా తప్పుపట్టారు. దేశ ప్రజలను ఎందుకు అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది. ఆర్థిక లోటును పూడ్చేందుకు రాబోయే ఆర్థిక సంవత్సరానికి సుమారు 14.13 లక్షల కోట్ల రుణం తీసుకోనున్నట్లు ఇటీవల బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఆ విషయాన్ని ప్రియాంకా గాంధీ తాజాగా సామాజిక మాధ్యమం ఎక్స్‌ అకౌంట్‌లో ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 14 లక్షల కోట్లు అప్పు తీసుకోవాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఎందుకోసం ఆ డబ్బు అని ప్రియాంకా ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు దేశం చేసిన అప్పు 55 లక్షల కోట్లు మాత్రమే. కానీ గడిచిన పదేళ్లలో మోడీ సర్కారు ఆ రుణాన్ని 205 లక్షల కోట్లకు చేర్చింది. అంటే మోడీ సర్కారు గత పదేళ్లలో సుమారు 150 లక్షల కోట్ల అప్పు చేసింది. దీంతో దేశంలోని ప్రతి పౌరుడిపై 1.5 లక్షల అప్పు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.

➡️