ఇది కాంగ్రెస్‌ ఓటమి, ప్రజలది కాదు : మమతా బెనర్జీ 

న్యూఢిల్లీ :    ” ఇది కాంగ్రెస్‌ ఓటమి, ప్రజలది కాదు” అని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష కూటమి ఇండియాలోని మిగిలిన పార్టీలతో సీట్లపంపకం లేకపోవడం వలనే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిందని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం సాధించిందని, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలోనూ కాంగ్రెస్‌ గెలవాల్సింది కానీ .. కొన్ని ఓట్లను ఇండియా కూటమిలోని పార్టీలు చేజిక్కించుకోవడంతో ఓటమిపాలైందని ఇదే వాస్తవమని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ ముందుకు రాలేదని, దీంతో ఓట్ల విభజన జరిగిందని అన్నారు.

భావజాలంతో పాటు గెలిచేందుకు సరైన వ్యూహం, ప్రణాళిక కూడా ఉండాలని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందం జరిగితే కేంద్రంలో బిజెపిని గద్దెదించవచ్చని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలోపు ఇండియా కూటమి కలిసి పనిచేసి, తప్పులు సరిదిద్దుకుంటుందని అన్నారు.

➡️