ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవికి అర్విందర్‌ సింగ్‌ లవ్లీ రాజీనామా

న్యూఢిల్లీ :    కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ అర్విందర్‌ సింగ్‌ లవ్లీ తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు.   అవినీతి ఆరోపణలపై పలువురు ఆప్‌ మంత్రులు జైలు పాలయ్యారని, పార్టీ కార్యకర్తలు  వ్యతిరేకించినప్పటికీ  కాంగ్రెస్‌ అధిష్టానం వారితో పొత్తు కుదుర్చుకుందని అర్విందర్‌ సింగ్‌ లవ్లి ఆ లేఖలో పేర్కొన్నారు.   ఢిల్లీ కాంగ్రెస్‌ కార్యకర్తల ప్రయోజనాలను  తాను రక్షించలేనందున పార్టీ యూనిట్‌ చీఫ్‌గా కొనసాగలేనని  కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకి లేఖ రాశారు.

కాంగ్రెస్‌పై తప్పుడు, కల్పిత, అవినీతి ఆరోపణలను మోపడం అనే ఏకైక ప్రాతిపదికన ఏర్పడిన ఆప్‌ పార్టీతో పొత్తును ఢిల్లీ కాంగ్రెస్‌ యూనిట్‌ వ్యతిరేకిచిందని, అయినా  అధిష్టానం  ఆప్‌తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకుందని అన్నారు. అంతర్గత విభేదాలను సూచిస్తూ.. ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌గా తాను తీసుకున్న అనేక నిర్ణయాలను ఎఐసిసి చీఫ్‌ ఖర్గే వీటో చేశారని అన్నారు.

పొత్తులో భాగంగా పార్టీకి మూడు సీట్లే కేటాయించడంపైనా అర్విందర్‌ అసంతృప్తి  వ్యక్తం చేశారు. రెండు స్థానాల్లో అసలు ఢిల్లీ కాంగ్రెస్‌తో సంబంధం లేని వ్యక్తులను అభ్యర్థులుగా ప్రకటించారని అన్నారు. నార్త్‌ వెస్ట్‌ స్థానానికి ఉదిత్‌ రాజ్‌,  నార్త్‌ఈస్ట్‌ స్థానానికి కన్హయ్య కుమార్‌ను ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ కాంగ్రెస్‌ యూనిట్‌ అధ్యక్షుడిగా గతేడాది ఆగస్టులో అర్విందర్‌ సింగ్‌ లవ్లీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

➡️