కర్ణాటకలో నగదు ప్రవాహం

Apr 8,2024 10:55 #Election Time, #Gold, #Karnataka, #seized
  • ఎన్నికల ముందు రూ.5 కోట్ల డబ్బు స్వాధీనం
  •  106 కిలోల నగలు కూడా..

న్యూఢిలీ : లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో నగదు ప్రవాహం విచ్ఛలవిడిగా జరుగుతున్నది. సోదాల్లో భాగంగా పోలీసులు బళ్లారిలోని కంబళి బజార్‌లోని హేమ జ్యువెలర్స్‌ దుకాణం యజమాని ఇంటిపై దాడి చేశారు. ఇందులో భాగంగా వారి నుంచి రూ.5.60 కోట్ల నగదు, 3 కిలోల బంగారం, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.7.6 కోట్లుగా ఉంటుందని తెలుస్తున్నది. నగల దుకాణం యజమాని నరేష్‌ సోనీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు హవాలా లావాదేవీకి సంబంధించినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే బళ్లారిలో ఇంత పెద్ద మొత్తంలో నగదు, బంగారు, వెండి ఆభరణాలు బయటపడటంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తున్నది. ఇటీవల బిజెపిలో చేరిన గాలి జనార్థన్‌, ఆయన కుటుంబం ప్రభావం బళ్లారిలో అధికంగా ఉంటుందనీ, అధికారులు మాత్రం ఇక్కడ ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని సామాజికవేత్తలు, ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.

➡️