మద్యం కేసులో కవితకు ఈడి కస్టడీ పొడిగింపు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణం, మనీలాండరింగ్‌ కేసుల్లో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్‌ ఎవెన్యూ కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) కస్టడీని మరో మూడు రోజులు పొడగించింది. ఈ నెల 26న ఉదయం 11 గంటల లోపు తిరిగి కోర్టు ముందు హాజరుపరచాలని ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. విచారణలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని, సిసిటివిల కింద విచారణ నిర్వహించాలని స్పష్టం చేసింది. కవిత కోరిక మేరకు ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. భర్త అనిల్‌, సోదరుడు కెటిఆర్‌ తదితర కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఏడు రోజుల కస్డడీ శనివారంతో ముగియడంతో కవితను ఇడి అధికారులు సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హజరుపరిచారు. ఇడి తరపున న్యాయవాది జోసెబ్‌ హుస్సేన్‌ వాదనలు వినిపిస్తూ…రూ.100 కోట్ల అక్రమ చెల్లింపులకు సంబంధించి కవిత కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ కేసులో మరో నలుగురి వాంగ్మూలాలు తీసుకొని, కలిపి ప్రశ్నించినట్లు తెలిపారు. కవిత నివాసంలో సోదాల సందర్భంగా ఫోన్‌ సీజ్‌ చేసామని, అనుమానస్పద రీతిలో ఉన్న కవిత మేనల్లుడు విచారణకు హాజరు కాలేదని కోర్టుకు నివేదించారు. ఇక్కడ వాదనలు జరుగుతోన్న సమయంలోనే హైదరాబాద్‌ లోని కవిత కుటుంబ సభ్యుల నివాసంలో సోదాలు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మరింత సమాచారం రాబట్టాల్సిన ఉన్నందున… కవితను మరో ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని జోసెబ్‌ విజ్ఞప్తి చేశారు. మూడు రోజులు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ధైర్యంగా ఉండండీ…:కవిత
కోర్టు అనుమతించడంతో కుటుంబ సభ్యులు, ఎంపిలు, మాజీ మంత్రులుతో కోర్టు హాల్‌ లోనే కవిత కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా భర్త అనిల్‌, కొడుకులు ఆదిత్య, ఆర్య, ఎంపిలు వద్ది రాజు రవిచంద్ర, కెఆర్‌ సురేశ్‌ రెడ్డి, మాలోతు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకున్నారు. ఈ సందర్బంగా మాలోతు కవిత, సత్యవతి రాథోడ్‌, కుటుంబ సభ్యులు, అభిమానాలు ఆమెను చూసి కన్నీరు పెట్టుకున్నారు. దీంతో వారందరిని దగ్గరికితీసుకున్న కవిత, ‘ఏడ్వొద్దు. భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మీరంతా ఉండగా నాకేం కాదు. మీరంతా వచ్చినందుకు ధన్యవాదాలు’ అని తెలిపారు.

➡️